10 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేయండి :సీఎంను కోరిన అక్బరుద్దీన్‌

10 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేయండి :సీఎంను కోరిన అక్బరుద్దీన్‌

పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆలయ విస్తరణ, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయంతోపాటు, అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకుపైగా చరిత్ర ఉన్నది. బోనాల సందర్భంగా లక్షల మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేస్తారు. కానీ, ఆలయ ప్రాంగణం వంద గజాలు మాత్రమే ఉండటంతో బోనాలు సమర్పించే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 కోట్లతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని.. ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అక్బరుద్దీన్‌ సీఎంను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అయ్యేలా దీవించాలని వేడుకుంటూ గతంలో సీఎం కేసీఆర్‌.. లాల్‌దర్వాజ అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన విషయాన్ని అక్బరుద్దీన్‌ గుర్తుచేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. మహంకాళి ఆలయ విస్తరణకు అవసమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతుల కోసం మూడు కోట్లు మంజూరు చేయాలని కోరారు. మసీదు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ముస్లింల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. అక్బరుద్దీన్‌ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. మహంకాళి ఆలయ అభివృద్ధి, అఫ్జల్‌గంజ్‌ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేయనున్నట్టు హామీఇచ్చారు.

ఇక మెట్రో రైలు ప్రాజెక్టును పాతబస్తీతో అనుసంధానం చేసే అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.. సంబంధిత అధికారులతో సమావేశమై త్వరలోనే పనులు ప్రారంభించాల్సిందిగా సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story