ఢిల్లీని తుడిచిపారేసిన చీపురు

ఢిల్లీని తుడిచిపారేసిన చీపురు

సామాన్యుడే రారాజు.. హస్తిన పీఠాధిపతి సామాన్యుడే. తీస్‌రీ బార్ ఆప్ కీ సర్కార్‌ అంటూ ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. అతిరథ మహారథులను ఎదిరించి అరవిందుడు అద్భుత విజయం సాధించాడు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి సిద్ధమయ్యాడు. ప్రధాని మొదలుకొని పార్టీ యంత్రాంగం యావత్తూ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ కమలం వికసించలేదు. 2 దశాబ్దాల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించి పార్టీకి పవర్ అందించడానికి మోదీ-షా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంతో పోలిస్తే సీట్లు కొద్దిగా పెరగడం తప్ప అధికారం మాత్రం.. అందని ద్రాక్షే అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుండుసున్నా వచ్చింది. ఎక్కడా ఆ పార్టీ ప్రభావం చూపలేదు. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ హస్తం పార్టీ ఖాతా తెరవలేదు.

సెంటర్‌లో మోదీ-స్టేట్‌లో కేజ్రీవాల్‌.. ఇదీ ఢిల్లీ ఓటరు స్పష్టమైన అభిప్రాయం. శాసనసభ ఎన్నికల ఫలితాలు చెబుతున్న మాట ఇదే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆప్ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. చరిత్రను తిరగరాస్తూ ఏకంగా 90 శాతం స్థానాలు దక్కించుకొని రికార్డు సృష్టించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను చీపురుపార్టీ ఏకంగా 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 8 సీట్లలోనే గెలుపొంది. కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆప్ దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ పోయింది. ఆ క్రమంలో మ్యాజిక్ ఫిగర్‌ 36ను దాటేసిన ఆప్, హాఫ్ సెంచరీ కొట్టేసింది. ఆ తర్వాత 60 మార్క్‌ వైపుగా పరుగందుకుంది. ఇక, బీజేపీ మొదట్లో కొద్దిగా పోటీ ఇచ్చినట్లు కనిపించింది. 20కి పైగా స్థానాల్లో లీడింగ్ సాధించింది. కానీ, కాసేపటికే సీన్ మారిపోయింది. 10-15 సీట్లు తెచ్చుకునే పొజిషన్‌కు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. 10 స్థానాలు కూడా సాధించే స్థితిలో బీజేపీ కనిపించలేదు.

ఢిల్లీ అంతటా ఆప్ ప్రభంజనమే. ప్రాంతాల తేడా లేకుండా హస్తిన ఓటర్లు చీపురుకే జై కొట్టారు. చాందీనీచౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీల్లో ఆప్‌కే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అన్నింటా ఆప్‌దే ఆధిపత్యం. బీజేపీ ఏ ప్రాంతంలోనూ బలంగా ప్రభావం చూపలేకపోయింది. సీఏఏ వ్యతిరేక నినాదాలతో వివాదాస్పద నియోజకవర్గాలుగా మారిన ఓక్లా, శీలంపూర్‌ నియోజకవర్గాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకే మెజార్టీ వచ్చింది.

ముచ్చటగా మూడోసారి విజయం సాధించడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచి విజయాన్ని ఆస్వాదించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నైరాశ్యంలో మునిగిపోయాయి. ముఖ్యంగా కమలదళంలో భారీ నిరాశ కనిపించింది. అధికారం దక్కకపోయినా కనీసం 25 స్థానాలైనా గెలుస్తామని ఆశిస్తే 10 సీట్లు కూడా రాకపోవడం కాషాయ శ్రేణులను షాక్‌కు గురి చేసింది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన పార్టీ ఇదేనా అని కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి 2015 నాటి సీన్ ఢిల్లీలో రిపీటైంది. ఆనాటి ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకొని ఆప్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ ఎన్నికల చరిత్రలో ఓ పార్టీకి అన్ని సీట్లు రావడం అదే మొదటిసారి. అప్పుడు బీజేపీకి 3 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌కు ఏమీ రాలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి పెద్దగా మారలేదు. ఆప్ మళ్లీ 60కి పైగా స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పింది. ఒక పార్టీ వరుస గా రెండు సార్లు 60కి పైగా సీట్లు, 90 శాతానికి పైగా స్థానాలు కైవసం చేసుకోవడం దేశ రాజకీయాల్లోనే అరుదైన అద్భుతమైన విషయం. ఇక బీజేపీకి గతంతో పోలిస్తే నాలుగైదు స్థానాలు పెరిగాయంతే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.

Tags

Read MoreRead Less
Next Story