ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అమరావతి ఉద్యమం

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అమరావతి ఉద్యమం

రాజధాని అమరావతిలో 56వ రోజు కూడా రైతుల దీక్షలు ఉధృతంగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా.. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోయినా.. అమరావతి ఆవేదనతో గుండెలు ఆగిపోతున్నా.. రాజధాని ప్రాంత రైతులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహించారు.

మరోవైపు, రైతుల 24 గంటల దీక్షలు కొనసాగుతూనేవున్నాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తమ ఉద్యమం ఆగబోదని రైతులు తెగేసి చెబుతున్నారు. చట్టపరంగానూ తమ హక్కుల కోసం పోరాడతామంటున్నారు. ఎన్ని ప్రాణాలు పోయినా ఉద్యమం మాత్రం ఆపేదిలేదని.. అమరావతిని తరలిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర ప్రజలు తమ రాజధాని ఎక్కడో చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుందనే ఆందోళన ప్రతి రైతులోనూ వ్యక్తమవుతోంది. ఏపీకి ఒకటే రాజధాని ఉండాలి.. అది కూడా అమరావతే కావాలని రైతులు, మహిళలు నినదిస్తున్నారు. 56 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా.. వారిలో అలుపన్నది ఏమాత్రం కనిపించడం లేదు.

అమరావతి ఉద్యమాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. విజయవాడలో నిర్వహించిన టీడీపీ నేతల విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. అమరావతి మహిళల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. 1984 పోరాటంలో ఎమ్మెల్యేలు హీరోలైతే.. నేడు ఎమ్మెల్సీలు హీరోలయ్యారని కొనియాడారు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ తప్పన్న వైసీపీ, ఇప్పుడు వైజాగ్‌లో ల్యాండ్‌ పూలింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చిన పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి రావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు.

ఇదిలావుంటే, అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జేఏసీ సిద్ధమవుతోంది. "గడప గడపకు అమరావతి" పేరుతో జేఏసీ సభ్యులు రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దళిత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు జేఏసీ నేతలు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని తరలింపు నేపథ్యంలో రాష్ట్రానికి జరగనున్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు.

అమరావతి సాధనే లక్ష్యంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో రోజురోజుకూ ఉద్యమం ముదురుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story