ఢిల్లీలో కంటికి కనబడనంత పాతాళంలోకి కూరుకుపోయిన కాంగ్రెస్

ఢిల్లీలో కంటికి కనబడనంత పాతాళంలోకి కూరుకుపోయిన కాంగ్రెస్

పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి. ఒకనాడు ఓ వెలుగు వెలిగింది. ఏడేళ్ల క్రితం వరకు హస్తినలో అధికారంలో ఉంది. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగి ఢిల్లీని శాసించింది కాంగ్రెస్. అంతటి వైభవం చాటిన పార్టీ ఇప్పుడు కంటికి కనబడనంత పాతాళంలోకి కూరుకుపోయింది. ఫలితాల్లో తమ గణాంకాలు చూసుకుంటే ఇప్పుడప్పుడే తగ్గని గుండె కోత తప్పుదు. 70 స్థానాల్లో 67 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్..ఒక్కటంటే ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. పైగా 63 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. చివరికి ఢిల్లీ పీసీసీ చీఫ్ సుభాష్ చోప్రా కూతురు శివాని చోప్రాకు కూడా డిపాజిట్ గల్లంతయ్యింది. కల్కజి అసెంబ్లీ నియోజకర్గం నుంచి శివాని పోటీ చేయగా..పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, ఎంపీ రాజబబ్బర్ లాంటి వాళ్లు ఆమెకు మద్దతుగా ప్రచారం చేసినా డిపాజిట్ కు సరిపడా ఓట్లు కూడా రాలేదు.

అంతేకాదు..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కూడా నామమాత్రంగానే సాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేవలం నాలుగు ర్యాలీలో మాత్రమే ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చెప్పుకునే ముస్లిం మైనారిటీల నియోజకవర్గాల్లోనూ మొండి చెయ్యే ఎదురైంది. ముస్తఫాబాద్, బాబర్ పూర్, సీలమ్ పూర్, బల్లిమరన్ లాంటి మైనారిటీ డామినేషన్ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ప్రభావం కనిపించలేదు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జీరో ప్లేసులోనే ఉన్నా..అప్పటితో పోలిస్తే ఇప్పుడు సాగానికి సగం ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటం ఆ పార్టీకి కలవరం కలిగించే అంశమే. ఇక కాంగ్రెస్ అలయెన్స్ తో బరిలోకి దిగిన ఆర్జెడీ అభ్యర్ధులకైతే నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.

1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్...ఢిల్లీలో పూర్తిగా చేతులెత్తేసింది. పార్టీలో షీలా దీక్షిత్ తర్వాత ఆ స్థాయి నాయకులు కనిపించటం లేదు. జాతీయ నాయకత్వమైనా లీడ్ తీసుకుంటుందా అంటే..ఎలక్షన్లకు ముందే సరెండర్ అయిపోయిన సంకేతాలు ఇచ్చేశారు. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా చేసుకొని తమ పుట్టి మునిగిపోతున్నా పట్టించుకోవటం లేదు కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా నిలిచే సపోర్టింగ్ క్యారక్టర్ కు దిగజారిపోయిందని హస్తం నేతలు ఆవేదన పడుతున్నారు. ఇక ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే కాంగ్రెస్ ఖల్లాస్ కావటం ఖాయమని సొంత పార్టీ నేతలే చురకలు అంటిస్తున్నారు. బీజేపీ ఓడిపోయిందని సంబరపడటం మానేసి అసలు మన పార్టీ సంగతేంటో ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చేసిందని హెచ్చరిస్తున్నారు. పార్టీ భారీ ఓటమిపై కాంగ్రెస్‌ మహిళా నాయకులు షర్మిష్టా ముఖర్జీ, ఖుష్బూ బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి .. నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆత్మశోధనలు చేసింది చాలు...పార్టీకి పనికి వచ్చే పనులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story