'క్రేజీ'వాల్ గెలుపులో ఈ నాలుగే కీలకం

క్రేజీవాల్ గెలుపులో ఈ నాలుగే కీలకం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. అందులో మొదటిది నేల విడిచి సాము చేయకపోవడం. ముఖ్యమంత్రిని అన్న భావనను కేజ్రీవాల్ ఎక్కడా కనిపించనివ్వలేదు. కామన్ మ్యాన్‌లా వ్యవహరించారు. మంత్రులను కూడా ఆర్బాటాలకు దూరంగానే ఉంచారు. ఇక, దేశ రాజధాని పరిధిలో ముఖ్యమైన శాఖలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి. ఈ విషయం రాజకీయ పార్టీలతో పాటు ఢిల్లీవాసులకు కూడా తెలుసు. పరిమితమైన శాఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ త్వరగానే గుర్తించారు. మొదట్లో కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించినప్పటికీ తర్వాత తర్వాత సర్దుకున్నారు. మోదీ సర్కారు తమకు కొన్ని విషయాల్లో సహకరిస్తోందని బహిరంగంగానే ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాస్త దూకుడుగా వ్య వహరించినప్పటికీ ఫలితాల అనంతరం వెనక్కి తగ్గారు. జాతీయ, దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాల్లో మోదీకే మద్ధతిచ్చారు. సెంటర్‌లో మోదీ, స్టేట్‌లో కేజ్రీవాల్ ఉంటే ఢిల్లీ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని ప్రచారం చేశారు. పనికిమాలిన విమర్శలకు పోకుండా ఐదేళ్లలో తానేం చేశానో, రాబోయే ఐదేళ్లలో ఏమేం చేయగలనో ప్రజలకు వివరించారు. ఇది తటస్థ ఓటర్లు, మేధావి వర్గాలు, విద్యాధికులను ఆకర్షించింది.

ఆప్ విజయంలో మరో ముఖ్య భూమిక విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు. విద్యారంగంలో ఆప్ సర్కార్‌ సాధించిన విజయం దేశానికే తల మానికంగా నిలుస్తోంది. బడ్జెట్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం 20 శాతానికి పైగా నిధులను విద్యారంగానికే కేటాయిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న అతిషి మారలెనాను విద్యారంగ సలహాదారుగా నియమించారు. హ్యాపీనెస్ అంశాల బోధన, 8వేల తరగతి గదుల నిర్మాణం, విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల కమిటీల ఏర్పాటు, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు బ్రేక్ వేయడంవంటి నిర్ణయాలతో విద్యావిధానంలో భారీగా మార్పులు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దే కార్యక్రమం పేద-మధ్యతరగతి వర్గాలను ఆకర్షించింది. 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత 91 శాతం నమోదైంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో 83 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఇది ఢిల్లీ ప్రజల మనసులపై బలమైన ముద్ర వేసింది.

ఆప్ గెలుపులో వైద్య రంగం సంస్కరణలు కూడా కీలకపాత్ర పోషించాయి. ఢిల్లీ వ్యాప్తంగా 400 మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని గతంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 200కు పైగా మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు మొహల్లా క్లినిక్‌లలో చౌకధరలకే వైద్యం అందించారు. క్లినిక్‌ల సంఖ్య తక్కువగా ఉండడం, రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ ఖర్చుతో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదు. ముఖ్యంగా, ప్రైవేటు హాస్పిటళ్లలో ఖర్చులు భరించలేని పేద-మధ్యతరగతి వర్గాలకు మొహల్లా క్లినిక్‌లు వరంలా మారాయి. ప్రాథమిక వైద్యం, వైద్య పరీక్షలు తక్కువ ధరకే లభించడంతో బడుగు బలహీనవర్గాలు ఆప్‌కు బలమైన మద్ధతుదారులుగా మారిపోయాయి.

విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలతో పాటు ఉచిత పథకాలతో మరికొన్ని వర్గాలకు దగ్గరయ్యారు. బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. బస్సుల్లో మహిళలపై ఆగడాలను అరికట్టడానికి మార్షల్స్‌ను నియమించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. 20 వేల లీటర్ల తాగునీటి ఫ్రీగా సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు. ఇవన్నీ పేదలను ఆకర్షించేవే. దేశ రాజధానిలో బొటాబొటీ జీతాలతో జీవితాలు గడిపే కుటుంబాలకు ఈ పథకాలు బలమైన ఆసరా అయ్యాయి. దాంతో వారంతా కేజ్రీవాల్‌కు బలమైన ఓటు బ్యాంకుగా మారిపోయారు.

షహీన్‌బాగ్, జామియా మిలియా నిరసనలు, భారత్-పాకిస్థాన్ వంటి భావోద్వేగ అంశాలకు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించారు. అదే సమయంలో ముస్లిం ఓటర్లలో పట్టు కోల్పోకుండా చూసుకున్నారు. ఇటీవలి వరకు కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ముస్లింలు మారిన పరిణామాలతో ఆప్‌ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో 13 శాతంగా ఉన్న మైనార్టీ ఓటర్లలో మెజార్టీ ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు.

కేజ్రీవాల్ గెలుపులో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ నాయకుల హద్దుమీరిన విమర్శలు ఆ పార్టీకే నష్టం చేకూర్చాయి. అధికారాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కొర్రీలు, కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు ప్రజలకు బాగా తెలుసు. నామినేషన్ సమయంలో కేజ్రీవాల్‌ను గంటల తరబడి నిలబెట్టడం కూడా ప్రజలను చిరాకు పెట్టింది. కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా పోల్చడం సగటు ఢిల్లీ ఓటరుకు నచ్చలేదు. చిల్లర రాజకీయాలు అంటూ ఢిల్లీవాసులు ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థే లేడు. ప్రజల డాక్టర్‌గా పేరొందిన డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా పని చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలకు సుపరిచితులైన మదన్ లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితర నాయకులు కన్నుమూశారు. ఫలితంగా స్థానికంగా కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే బలమైన నాయకుడు లేకుండా పోయారు. దీంతో పాటు అవినీతిని తగ్గించడం, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలపై ప్రజల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. ఫలితంగా రెండోసారి బంపర్ విక్టరీ కొట్టారు.

Tags

Read MoreRead Less
Next Story