57 రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న అమరావతి ఉద్యమం

57 రోజులుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న అమరావతి ఉద్యమం

అమరావతి భగ్గుమంటోంది. 57 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ పోరాటంలో అలిసిపోయిన ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రాజధాని గ్రామాలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. ఇలాంటి సమయంలో సీఎం జగన్ హస్తిన పర్యటన చేప్టటారు. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. జనంలో ఎక్కడో చిన్న ఆశ! తమ ఆవేదన, ఆక్రందనను జగన్ అర్థం చేసుకోకపోతారా..? ప్రధాని మోదీ ముందు ప్రస్తావించకపోతారా? అని ఎదురుచూశారు. కానీ జరిగింది వేరు. మూడు రాజధానులపై దూకుడుగా ముందుకెళ్తున్నారు జగన్..

ఊహించినట్లుగానే ప్రధానితో సమావేశంలో 3 రాజధానులు అంశాన్ని ప్రస్తావించారు జగన్. రాష్ట్ర సమగ్రఅభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు.. శాసనసభ కూడా ఆమోదం తెలిపాయని చెప్పారు. మండలి రద్దును కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కానీ గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం స్పందించలేదు. అమరావతి ఎందుకు రగిలిపోతుందో చెప్పలేదు? అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 2 నెలలుగా చిన్నాపెద్దా తేడాలేకుండా అంతా ఎందుకు రోడ్డెక్కుతున్నారో ప్రస్తావించలేదు! వివిధ అంశాలపై ప్రధాని మోదీకి సుదీర్ఘ వినతిపత్రం ఇచ్చిన సీఎం జగన్.. అందులో ఎక్కడా రాజధాని రైతుల ఆందోళనలను మాత్రం చెప్పలేదు..

పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు జగన్. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు..అసెంబ్లీ కూడా ఆమోదముద్ర వేసిందని స్పష్టం చేశారు. అంటే ఏదిఏమైనా తన నిర్ణయంపై ముందుకే వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన కేబినెట్‌లోని మంత్రుల మాటలు కూడా ఇదే అంశాన్ని నిర్ధారిస్తున్నాయి..

అయితే 3 రాజధానులు, మండలి రద్దుపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఏపీలో మాత్రం బీజేపీ, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది.. అమరావతికి మద్దతుగా జనంలోకి వెళ్లేందుకూ ప్రణాళికలు రచిస్తోంది..ఏపీలోని పరిణామాలపై ప్రధాని మోదీకి పూర్తి అవగాహన ఉందని.. అమరావతిని తరలించే ప్రసక్తే ఉండదని గట్టిగా చెబుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అయితే ఢిల్లీ బీజేపీ పెద్దల వాదన మాత్రం మరోలా ఉంది. రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదేనన్న లీకులు ఇప్పటికే ఇచ్చేశారు. ఒకే పార్టీ నేతల నుంచి ఇలా భిన్నవాదనలు వినిపించడం గందరగోళాన్ని రేకెత్తిస్తున్నాయి..మరి కేంద్రం ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story