కొవిడ్-19 వైరస్ : 12 వందల మందికి చేరిన మృతుల సంఖ్య

కొవిడ్-19 వైరస్ : 12 వందల మందికి చేరిన మృతుల సంఖ్య

కొవిడ్-19 వైరస్.. ఈ పేరు వింటేనే చైనా మొత్తం షేక్‌ అయిపోతోంది. ఈ మహమ్మారి సృష్టించిన విలయం అలాంటిది. ఇప్పటికే 12 వందల మందికిపైగా చనిపోయారు.. దాదాపు 50 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీన్ని ఎలా అరికట్టాలో తెలియక చైనాతోపాటు ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి... ప్రపంచానికి కరోనా ప్రమాదం మరింత పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంటే.. చైనా అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. వాక్సిన్‌ అందుబాటులోకి రావడానికే మరో 18నెలల సమయం పడుతుందని WHO ప్రకటించింది. ప్రపంచదేశాలు వెంటనే మేల్కొని ఈ వైరస్‌ను నెం.1 ప్రజా శత్రువుగా’ పరిగణించాలని హెచ్చరించింది. ఇలా అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో చైనా ఇలాంటి ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

చైనాలోని కొన్ని ప్రావిన్సుల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గినప్పటికీ ఈ నెల చివరినాటికి తారస్థాయికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చైనాలో దాదాపు 44 వేల 653 కేసులు నమోదుకాగా గత 24 గంటల్లోనే 2 వేల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. అటు వాస్తవానికి చైనా అధికారికంగా ప్రకటిస్తున్న సంఖ్యకు పొంతన లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే చైనా వైద్యులు మాత్రం జనవరి తర్వాత మొదటిసారిగా కొవిడ్‌-19 కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రకటించారు. ఏప్రిల్‌ చివరి నాటికి దీని ప్రభావం పూర్తిగా ఉండబోదని అంచనా వేశారు..

అయితే కేసుల సంఖ్య తగ్గినంత మాత్రాన వైరస్ ప్రభావం లేదనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు. ఇప్పటికిప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. కావాలనే చైనా తీవ్రతను తగ్గించి చూపుతోందని ఆరోపిస్తున్నారు...అయితే కేసులు తగ్గుముఖం పట్టాయంటూ...చైనా వైద్యులు తాజాగా చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చాలా స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడం విశేషం..

చైనా ఆర్థికరంగంపై కరోనా ఎఫెక్ట్ కొనసాగుతుందని పలు అంతర్జాతీయ కంపెనీలు అంచనా వేస్తున్నాయి . ఇప్పటికే చాలా కంపెనీలు మూతపడ్డాయి, వాటిని పునరుద్ధరించడానికి భారీ స్థాయిలో ఆర్థిక సాయం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. కార్ల నుంచి మొదలుకొని మొబైల్‌ ఫోన్ల తయారీ వంటి సంస్థల వరకు పూర్తిగా దెబ్బతిన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఆ దేశ ఆర్థికవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story