కొవిడ్-19 : తల్లీకూతుళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ

కొవిడ్-19 : తల్లీకూతుళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ

చైనాలో మహమ్మారి కరోనా వైరస్ నుంచి బాధితుల్ని కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అవిశ్రాంత సేవలో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా రోజులు తరబడి ఆస్పత్రిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తమను చూసేందుకు ఆస్పత్రికి వస్తున్న కుటుంబసభ్యుల్ని కలవడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంఘటనలు చైనీయుల్లో ఆత్మవిశ్వాసం నింపితే.. ఇంకొన్ని ఆవేదన మిగుల్చుతున్నాయి. ఇటీవల ఓ తల్లీకూతురు మధ్య జరిగిన సంభాషణ కంటతడి పెట్టిస్తోంది.

చైనా హెనాన్ ప్రావిన్స్‌ ఫుగౌ కౌంటీ పీపుల్స్ ఆస్పత్రిలో లియు హైయాన్ నర్సుగా పనిచేస్తుంది. ఇంటికి వెళ్లకుండా ఆ ఆస్పత్రిలో ఉంటూ కరోనా వైరస్ బాధితులకు సేవ చేస్తుంది. అయితే తల్లి ఇంటికి రాకపోవడంతో లియు కూతురు చెంగ్ షివెన్‌ ఆస్పత్రికి వచ్చింది. వస్తూ వస్తూ తల్లి కోసం ఓ లంచ్ బాక్స్ తీసుకొచ్చింది. అయితే కరోనా వ్యాధి సోకుతుందనే ఉద్దేశంతో ఆస్పత్రి యాజమాన్యం కూతుర్ని కలిసేందుకు ఒప్పుకోలేదు. దీంతో తల్లి కూతుళ్లు దూరం నుంచే సైగలతో మాట్లాడుకున్నారు. గాల్లోనే హగ్ చేసుకున్నారు. ఐ మిస్ యూ మమ్మీ అంటూ చెంగ్ కన్నీటి పర్యంతమైంది.

దీంతో భావోద్వేగానికి గురైన లియు.. తాను కరోనా అనే రాక్షసితో పోరాడుతున్నానని.. దానిపై విజయం సాధించిన వెంటనే.. ఇంటికి వస్తానని కూతురికి ధైర్యం చెప్పింది. తల్లీకూతుళ్ల మధ్య జరిగిన ఈ హృదయవిదారక సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story