అందుకే అమిత్ షా, జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో అధిక ప్రాధాన్యత

అందుకే అమిత్ షా, జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో అధిక ప్రాధాన్యత

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన రోజు వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి రద్దును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటం..ఏపీ బీజేపీ రద్దును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే..దాదాపు సుమారు 40 నిమిషాల పాటు సాగిన వీరి భేటీలో పెండింగ్‌ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, వికేంద్రీకరణ, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించారు. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. అయితే..ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 838 కోట్లు ఆదా చేశామని అమిత్ షాకి వివరించారు.

ఇక గ్రాంట్ల రూపంలో గత ప్రభుత్వం 22,000 కోట్లు విడుదల చేస్తే ప్రస్తుతం రాష్ట్రానికి కేవలం రూ.10, 610 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా కోరారు. వెనకబడ్డ జిల్లాలకు 1050 కోట్లు మాత్రమే వచ్చాయని..గత మూడేళ్లనుంచి నిధులు రాలేదన్నారు. రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉందన్నారు.

ఇక మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు వంటి అంశాల్లో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖే. అందుకే జగన్, అమిత్ షా భేటీ రాజకీయ వర్గాల్లో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మండలి రద్దుకు దారి తీసిన పరిణామాలతో పాటు మూడు రాజధానుల ఆవశ్యత, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై అమిత్ షాకు సీఎం సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షాకు అందించిన విజ్ఞాపన పత్రంలో జగన్ వివరించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామని.. హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న హామీకి కట్టుబడి ఉండాలన్నారు.

మండలి రద్దు కారణాలను కూడా అమిత్ షాకు వివరించారు జగన్. శాసనమండలి మెరుగైన పాలనకు సలాహాలు ఇవ్వాల్సింది పోయి..పథకాలకు అడ్డుపడే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిందని..కేంద్ర అనుమతి కోసం చొరవ తీసుకోవాల్సిందిగా జగన్ తన విజ్ఞాపన పత్రంలో కోరారు.

Tags

Read MoreRead Less
Next Story