ట్రంప్ భారత పర్యటనకు అద్భుత స్థాయిలో ఏర్పాట్లు

ట్రంప్ భారత పర్యటనకు అద్భుత స్థాయిలో ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అద్భుత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. హౌడీ మోదీ మీటింగ్‌ను మించేలా ట్రంప్‌ మీటింగ్‌కు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో 22 కిలోమీటర్ల మేర ట్రంప్-మోదీ రోడ్ షో జరగనుంది. దాదాపు 50 వేల మంది ట్రంప్-మోదీలకు స్వాగతం పలకనున్నారు. రోడ్ షో పొడవునా వివిధ రాష్ట్రాల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులతో కనిపిస్తారు. సంప్రదాయ నృత్యాలతో ట్రంప్-మోదీలకు స్వాగతం పలకనున్నారు.

రోడ్ షో తర్వాత ట్రంప్-మోదీలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. సబర్మతితో మహాత్మాగాంధీకి ఎంతో అనుబంధం ఉంది. సబర్మతి సందర్శన తర్వాత అహ్మాదాబాద్‌లోని మొటెరా క్రికెట్ స్టేడియానికి వెళ్తారు. అక్కడ స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే, భారతీయ దిగ్గజ కంపెనీల సీఈఓలతో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ నెల 25న ట్రంప్-సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, బయోకాన్ సీఎండీ కిరణ్ మజూందార్ షా తదితులు మోదీని కలవనున్నారు.

ట్రంప్ ఇండియా టూర్‌లో వాణిజ్యమే ప్రధానాంశం. ట్రేడ్ డీల్‌పైనే ఇరు దేశాలు తుది విడత చర్చలు జరపనున్నాయి. దేశీయ పౌల్ట్రీ, డైరీ మార్కెట్‌పైనా అమెరికా కన్నేసింది. ఈ రెండు రంగాల్లో అమెరికన్ కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ సర్కారు పట్టుబడుతోంది. అమెరికా పాల ఉత్పత్తులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవాలని కోరుతోంది. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు తిరస్కరించింది. డైరీ పరిశ్రమపై ఆధారపడి 8 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. దేశీయ పాడి పరిశ్రమ నష్టపోవద్దనే ఉద్దేశంతో డైరీ రంగంలోకి దిగుమతులను అడ్డుకుంటోంది. ఐతే, భారత్‌-అమెరికా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడానికి డైరీ పరిశ్రమలో పరిమితులను పాక్షికంగా సడలించడానికి మోదీ ప్రభుత్వం సిద్దమైందని ప్రచారం జరుగుతోంది. పాడి పరిశ్ర మతో పాటు చికెన్ లెగ్స్ దిగుమతులకూ అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తే మనదేశానికి అమెరికా నుంచి జీఎస్పీ హోదాను పునరుద్ధరిస్తారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, భారత పర్యటనపై ట్రంప్ తన ఇంట్రెస్ట్‌ను మరోసారి వెల్లడించారు. మోదీకి, తనకు మధ్య ఉన్న కామన్ పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. ఫేస్‌బుక్‌లో తామిద్దరం రారాజులం అని ట్రంప్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో ఎక్కువంది ఫాలోవర్స్ ఉన్న పొలిటికల్ లీడర్లలో ఫస్ట్ ప్లేస్‌లో ట్రంప్ ఉండగా, సెకండ్ ప్లేస్‌లో మోదీ ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్, సోషల్ మీడియా కింగ్‌ల మధ్య మీటింగ్ జరగబోతోందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story