Top

రైతు కన్నీరు రాష్ట్ర భవిష్యత్‌కి మంచిది కాదు: పవన్ కల్యాణ్

రైతు కన్నీరు రాష్ట్ర భవిష్యత్‌కి మంచిది కాదు: పవన్ కల్యాణ్
X

60 రోజులుగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు రాజధాని గ్రామాల్లో పర్యటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. యర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో పర్యటించిన పవన్ రైతులు, మహిళలలో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. అమరావతి ఉద్యమానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

రైతుల కన్నీరు రాష్ట్ర భవిష్యత్‌కు మంచిది కాదన్నారు పవన్ కల్యాణ్. సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చితే పాలన అస్తవ్యస్థమవుతుందన్నారు.రాష్ట్రానికి అమరావతే రాజధాని అని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. ఇష్టానుసారం నిర్ణయాలను మార్చుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్‌ రాజధాని రైతులను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.

మూడు రాజధానుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారన్న అనుమానం కలుగుతోందని తుళ్లూరులో పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించింది ఓ మహిళ.. అయితే మూడు రాజధానులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చినట్లుగా చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు పవన్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటలు ఉండవని.. ఏం చేసినా లిఖితపూర్వకంగా మాత్రమే ఉంటాయన్నారు. వైసీపీ-బీజేపీ మధ్య ఎటువంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉంటుంది. అదే అమరావతే అని స్పష్టం చేశారు పవన్. ప్రతి ఒక్కరు జై అమరావతి అనాలని అంటున్నారని.. అయితే తాను ఆ మాట అనలేనని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు ఒకటే అని చెప్పారు. ఇక్కడ జై అమరావతి అంటే సీమలో జై కర్నూలు, ఉత్తరాంధ్రలో జై ఉత్తరాంధ్ర అనమంటారని...పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాజధానికి భూములు ఇవ్వడమే తాము చేసిన పాపమా అని జనసేన అధినేత పవన్‌ క్యలాణ్‌ ముందు అమరావతి రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. 60 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అమరావతే రాజధానిగా ఉంటుందని భరోసా ఇచ్చిన పవన్.. ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES