ఓడినవాళ్లు ఓపెన్‌గా ఏడిస్తే.. గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారు : పవన్ కల్యాణ్

ఓడినవాళ్లు ఓపెన్‌గా ఏడిస్తే.. గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారు : పవన్ కల్యాణ్

గత ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్.. ఓటమి తర్వాత కూడా అధైర్యపడకుండా పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను అభినందించారు. కులమతాల ఆధారంగా దేశం, రాష్ట్రం విచ్ఛిన్నం కావడం కరెక్టు కాదన్నారు. నేటీకి కులాలు, మతాల ప్రాతిపదికన మాట్లాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పనిచేసిందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఓడినవాళ్లు ఓపెన్‌గా ఏడిస్తే.. గెలిచినవాళ్లు ఇంటికెళ్లి ఏడ్చారని గుర్తు చేశారు. వైసీపీకి ఓట్లేసిన వాళ్ల పనులు కూడా జరగడం లేదని పవన్ విమర్శించారు. పనులు జరగడం లేదేంటని ప్రశ్నిస్తే.. డబ్బులు తీసుకోలేదా అని ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారని పవన్‌ ఆరోపించారు.

గత ఎన్నికలకు ముందు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా టీడీపీకి ఓటమి తప్పలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని పవన్ పేర్కొన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు.

భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనే అని ఆ పార్టీ అధినేత పవన్ అన్నారు. తమ పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయేది కాదని.. ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకునేదని చెప్పారు. తరువాత పార్టీ న్యాయ విభాగంతో సమావేశమైన ఆయన.. జనసేనను బతికించింది సామాన్యుడేనని.. అలాంటి సామాన్యుడికి కవచంలా న్యాయవిభాగం పనిచేయాలని సూచించారు. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story