పాత సంప్రదాయానికి పులిస్టాప్.. రాజ్యసభకు ప్రియాంక గాంధీ?

వరుస ఓటములతో పార్టీ ప్రక్షాళణకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్.. ముఖ్యంగా ఢిల్లీ ఘోర పరాభవంతో ఖంగుతిన్న అధిష్ఠానం ఆత్మ పరిశీలనలో పడింది. అందుకే ఈసారి రాజ్యసభకు పెద్దలను కాకుండా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పంపించాలని సోనియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంకతో పాటు మరికొందరు జూనియర్లను కూడా రాజ్యసభకు పంపించి పార్టీకి కొత్త ఊపు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజ్యసభ సభలో సీనియర్లైన అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ సింగ్ కాల పరిమితి ముగుస్తోంది. వీటిని ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ నేతలతో భర్తీ చేయనున్నారు. అయితే పెద్దల సభకు ఎప్పటి లాగే పెద్దలను పంపించకుండా, పాత సంప్రదాయానికి పులిస్టాప్ పెట్టి కొత్త రక్తాన్ని రాజ్యసభకు పంపిస్తారని కాంగ్రెస్‌లోని ఓ ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగానే ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభ బరిలోకి దింపి, పార్టీని పటిష్టం చేయాలని సోనియా భావిస్తున్నట్లు సమాచారం. ఇటు లోకసభలో రాహుల్ గాంధీ, అటు రాజ్యసభలో ప్రియాంక గాంధీ.. ఇలా ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. పార్టీని పటిష్టం చేస్తారన్న ఫార్ములాను కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించనుంది. అయితే దీనిపై సోనియా ఓ స్పష్టమైన నిర్ణయం ఏదీ తీసుకోకపోయినా.. ఆ దిశగానే అధ్యక్షురాలి అడుగులు పడతాయని కోర్ కమిటీ సభ్యులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com