'ఆమె'కు హోదా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

ఆమెకు హోదా ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

ఆమె కమాండ్ చేయగలదు. శారీరక లక్షణాలు ఆమె ప్రతిభ-సామర్థ్యాలకు అడ్డంకి కాదు. సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మాట ఇది. సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదాపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. వుమెన్ ఆఫీసర్లకు తప్పనిసరిగా శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ హోదా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. 3 నెలల్లోగా శాశ్వత కమిషన్ హోదా మంజూరు చేయాలని ఆదేశించింది. స్త్రీల సామ ర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనాధోరణి మార్చుకోవాలని హితవు పలికింది. అతివల హక్కులకు, శారీరక లక్షణాలతో ముడి పెట్టండ సమంజసం కాదని స్పష్టం చేసింది. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది.

భారత ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్మీలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన జవాన్లు ఉన్నారని.. కమాండ్ హోదాలో మహిళా అధికారులను అంగీకరించడానికి వారు మానసికంగా సిద్ధంగా లేరని కేంద్రం పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం నివేదికపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయుధ బలగాల్లో లింగ వివక్షను తొలగించాలంటే ప్రభుత్వఆలోచనా ధోరణి మారాలని స్పష్టం చేసింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిషేధించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇది స్త్రీ-పురుషుల సమానత్వ హక్కులకు వ్యతిరేకమని అభిప్రా యపడింది. అతివల శారీరక లక్షణాలకు, వారి హక్కులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. స్త్రీలు ఇంటి పనులకు మాత్రమే పరిమితమనే ఆలోచనా ధోరణి మారాలని హితవు పలికింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధనల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. స్త్రీలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వకుండా కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోంద దుయ్యబట్టింది. సుప్రీంకోర్టు తీర్పుపై మహిళా జవాన్లు హర్షం వ్యక్తం చేశారు. సైన్యంలోనూ తాము సత్తా చాటగలమని, దళాలను తాము కమాండ్ చేయగలమని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story