రాజధాని కోసం ఎందాకైనా పోరాటం : అమరావతి రైతులు

రాజధాని కోసం ఎందాకైనా పోరాటం : అమరావతి రైతులు

అదే హోరు.. అదే నినాదం.. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. సేవ్‌ అమరావతి అంటూ రైతుల నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా.. రాజధాని కోసం ఎందాకైనా పోరాడతామంటున్నారు అమరావతి రైతులు. ఇది రెండు జిల్లా ఉద్యమం కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల ఉద్యమమని స్పష్టం చేస్తున్నారు.

అమరావతి ఉద్యమం 63వ రోజుకు చేరింది. మొక్కవోని దీక్షతో చేస్తున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం భావించినా.. నిరసనలను పక్కదారి పట్టించాలని యత్నించినా... రైతులు తమ సంకల్పాన్ని వీడడంలేదు. ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం లేదు. 63వ రోజు కూడా దీక్షలు, ధర్నాలతో ముందుకు సాగాలని నిర్ణయించారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం చెప్పేదాకా.. పోరాటం చేస్తామంటున్నారు రైతులు..

రాజధాని రైతులకు మద్దతుగా కిష్టాయపాలెంలో నారా లోకేష్ పర్యటించారు. 60 గంటల నిరశన చేపట్టినవారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా రైతులు లోకేష్‌కు స్పష్టంచేశారు. జై అమరావతి అంటే కేసులు పెడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తీరు కారణంగా రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆరోపించారు..

మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంతో పాటు రాజధాని గ్రామాల్లో ఉద్యమం ఉదృతంగా కొనసాగుతోంది. రైతులు తమ దీక్షల్ని కొనసాగించారు. రాజధాని కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తామంటున్నారు రైతులు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు...

మరోవైపు ఈ పోరాటంలో అలిసిపోయి మరో గుండె ఆగింది. వెలగపూడికి చెందిన జెట్టి సోమేలు గుండెపోటుతో మరణించాడు. రాజధాని తరలిపోతోంది, పనులు ఉండవని కొన్నాళ్లుగా సోమేలు ఆవేదనతో ఉన్నాడు. రోజూ రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ప్రభుత్వ మొండి వైఖరితో భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో వెలగపూడిలో విషాదం నెలకొంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మహిళనేత పురందేశ్వరిని కలిశారు అమరావతి మహిళా జేఏసీ, మహిళా రైతులు. తమ విజ్ఞాపన పత్రం దజేశారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి తెలియ జేయాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని ఉద్యమంలో మహిళలు అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. వృద్ధ మహిళలకు ఆరోగ్యం సహకరించకపోయినా పగలనక రాత్రనకా దీక్షలు చేస్తూనే ఉన్నారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్న చీమ కుట్టినట్టు కూడా లేని ఈ ప్రభుత్వం.. త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story