అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు

అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు

అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు ఆగడం లేదు. ఎవ్వరో ఒకరు ఏదో ఒక అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. తాజాగా అయోధ్యకు చెందిన కొందరు ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాధులపై ఆలయం ఎలా నిర్మిస్తారని ముస్లింలు ప్రశ్నించారు. ఘోరీలపై రామాలయం నిర్మించడం సమంజసమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. సమాధులపై టెంపుల్ నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని వాదించారు. ఈ మేరకు ముస్లింలు అయోధ్య ట్రస్టుకు నేరుగా లేఖ రాశారు. అయోధ్య కేసులో ముస్లింల తరపున వాదించిన లాయర్ MR షంషద్, రామాలయ ట్రస్టుకు సారధ్యం వహిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కె. పరాశరన్‌కు లేఖ పంపారు. ఆ లేఖలో సంచలన వివరాలను పేర్కొన్నారు.

అయోధ్యలో గత రెండు శతాబ్దాల్లో జరిగిన పరిణామాలను ముస్లింలు ప్రస్తావించారు. 1885లో అయోధ్యలో జరిగిన అ్లలర్లలో 75 మంది ముస్లింలు చనిపోయారట. వారి సమాధులన్నీ ప్రస్తుతమున్న మసీదు పరిసరాల్లోనే ఉన్నాయట. అప్పటి నుంచి ఆ స్థలాన్ని శ్మశానంగా ఉపయోగిస్తున్నారట. అలాగే, 1994లో ఇస్లామీ ఫారూఖీ కేసు తీర్పును కూడా ముస్లింలు ప్రస్తావించారు. వివాదాస్పద కట్టడానికి మూడు వైపులా సమాధులు ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారని ముస్లింలు గుర్తు చేశారు. 1948లో మసీదులో శ్రీరాముడి విగ్రహాలు పెట్టడం, 1992లో మసీదును ధ్వంసం చేయడం తదితర కారణాలతో ఆ ప్రదేశం మొత్తం చిందరవందరగా మారింది. అందువల్ల ఆనాటి సమాధులు ఇప్పుడు పైకి కనిపించకపోవచ్చని, ఐతే టెంపుల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపినప్పడు ఘోరీ లు కనిపించే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో, ముస్లింల సమాధులు ఉన్న నాలుగైదు ఎకరాల స్థలాన్ని మాత్రం ఆలయ నిర్మాణానికి వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేసింది. రామాలయ నిర్మాణానికి 67 ఎకరాల స్థలాన్ని ట్రస్టుకు అప్పగించింది. మరికొన్ని రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ట్రస్టుకు ముస్లింలు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ లెటర్‌పై అయోధ్య ట్రస్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story