హెచ్‌ఐసీసీలో బయో ఏషియా 2020 సదస్సు ప్రారంభం

హెచ్‌ఐసీసీలో బయో ఏషియా 2020 సదస్సు ప్రారంభం

ఫార్మాహబ్‌గా ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హెచ్‌ఐసీసీలో బయో ఏషియా 2020 సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫార్మా రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను ఆయన వివరించారు.

బయో ఏషియా సదస్సుకు 37 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భారత్‌లోని ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నుంచే 35 శాతం తయారవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించిందని.. అందుకే అన్ని అనుమతులూ వచ్చాయన్నారు.

బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 276 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటైందని.. రెండేళ్ల వ్యవధిలో 20 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయని వెల్లడించారు.

ట్రిపుల్‌ ఐ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్‌ ట్రోపికల్ మెడిసిన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సిన్ జీన్ బయోటెక్ రిసర్చ్ సెంటర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామని మంత్రి అన్నారు.

ఈ నెల 19 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. ఈ రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story