పరువునష్టం దావా వేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్న యనమల

ఏపీలో ఐటీ రైడ్స్ మంటలు ఆగడం లేదు. చంద్రబాబు పీఎస్ రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు వైసీపీ చేసిన ఆరోపణలు తప్పని రుజువు చేసింది టీడీపీ. ఐటీ పంచనామ రిపోర్ట్ 2 లక్షలు సీజ్ చేసినట్లు ఉంటే.. వైసీపీ, తన అనుకూల మీడియా 2 వేల కోట్లంటూ బురద రాజకీయాలకు పాల్పడిందని ఫైర్ అవుతున్నారు.
ఇటు వైసీపీ మంత్రులు, నేతలు మాత్రం మాటల దాడి ఆపడం లేదు. త్వరలోనే నిజా నిజాదాలు తెలుస్తాయని.. అక్రమాలన్నీ బయటకు తీస్తామని చెబుతున్నారు..
ఐటీ దాడులపై వైసీపీ తీవ్ర దుష్ప్రచారం చేసిందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయని ఎలా చెప్తారని యనమల ప్రశ్నించారు. పరువునష్టం దావా వేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు యనమల.
బలహీన వర్గాలను మభ్యపెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు వారిపై కక్ష కట్టారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. నాన్‌బెయిలబుల్ కేసు పెట్టారని తప్పుపట్టారు. IT దాడులపై ఇష్టానుసారం మాట్లాడారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
జగన్ ఆస్తుల వివరాలు చెప్పే ధైర్యం వైసీపీ వాళ్లకు ఉందా అని సవాల్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. జగన్ చెమటోడ్చి సంపాదించారా అని ప్రశ్నించారు. నిజం చెప్పే ధైర్యం లేక.. కావాలనే టీడీపీ టార్గెట్‌గా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారన్నారు వర్ల రామయ్య.
ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తే ఇప్పట్లో ఐటీ మంటలు చల్లారేలా కనిపించడం లేదు. ఐటీ శాఖ గుర్తించిన రెండు వేల కోట్లకు సంబంధించిన అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని వైసీపీ చెబుతోంది. ఇటు అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై న్యాయపరమైన చర్యలకు టీడీపీ సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com