రెచ్చిపోయిన తహశీల్దార్ వనజాక్షి.. రైతులను బ్రోకర్లుగా సంబోధిస్తూ..

ఏపీలో తహశీల్దార్ వనజాక్షి రెచ్చిపోయారు. రైతులను బ్రోకర్లుగా సంబోధిస్తూ.. వాడకూడని పదజాలంతో బూతులు తిట్టారు. దీంతో.. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల ఇళ్ల స్థలాలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి.. తహశీల్దార్ వనజాక్షి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, తాము ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూములను తీసుకోవడమేంటని మహిళా రైతులు నిలదీశారు. తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు అడిగిన ప్రశ్నలకు తహశీల్దార్ వనజాక్షి సూటిగా సమాధానం చెప్పలేదు. మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదంటూ దురుసుగా ప్రవర్తించారు. రైతులు గట్టిగా నిలదీయడంతో మీరు రైతులా..? బ్రోకర్లా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమను బ్రోకర్లని అంటారా.. అని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వనజాక్షి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలని కూడా చూడకుండా తహసిల్దార్ వనజాక్షితో పాటు.. రెవెన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. రైతులపై దాడికి పాల్పడ్డారు. మహిళా రైతులను బ్రోకర్లుగా సంభోధించడంపై రైతు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఒక మహిళా అధికారి అయి ఉండి.. అలా మాట్లాడ్డం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీ అనే ప్రాథమిక విషయాన్ని వనజాక్షి విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా రైతులను బూతులు తిట్టి.. దాడులకు పాల్పడ్డం ఏపీలోనే చూస్తున్నామని రైతు సంఘాలు విమర్శించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com