బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన పీకే

బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన పీకే

బిహార్ సీఎం.. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నెక్ట్స్ టార్గెట్ ఇదే. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు పీకే చెప్పకనే చెప్పారు. నర్మగర్భంగా చెప్పినా, దాటవేసినట్లు మాట్లాడినా పీకే మాటల అంతరార్థం ఇదే. బిహార్‌లో ప్రజలందరినీ కలుస్తానని పీకే తెలిపారు. బాత్‌ బిహార్‌కీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పారు. తనకు తెలిసిన విషయాలను ప్రజలందరితో పంచుకుంటానని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని వెల్లడించారు. బిహార్ పర్యటన ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేనన్నారు.

భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానంటూ కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పీకే, ఫైనల్‌గా తన డెసిషన్ చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఐతే వేలాదిమందితో రాజకీయ శక్తిని సృష్టిస్తానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు తనకు ముఖ్యం కాదని, బిహార్‌ అభివృద్ధే తనకు ముఖ్యమని చెప్పారు. తన దృష్టంతా బిహార్‌పైనే ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్, బీజేపీ మధ్య పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కారణంగానే బిహార్‌లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కమలదళంతో చేయి కలిపిన తర్వాత నితీష్ కుమార్ మారిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమనుకుంటున్నారని, అభివృద్ధిని పక్కనపెట్టారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా బిహార్ ఉందని, ఇది రాష్ట్ర ప్రజలకు అవమానకరమని మండిపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టం జేడీయూలో చిచ్చు రేపింది. సీఏఏకు నితీష్ కుమార్‌ మద్ధతు తెలపడాన్ని ప్రశాంత్ కిషోర్, సీనియర్ నేత పవన్ వర్మ తప్పుపట్టారు. అక్కడ మొదలైన విభేదాలు అంతకంతకూ ముదిరాయి. ఇన్‌డైరెక్ట్ అటాక్ నుంచి డైరెక్ట్‌గా నితీష్‌పై విమర్శలు చేసే పరిస్థితి ఏర్పడింది. చాలాకాలం ఓపిగ్గా భరించిన నితీష్, ఇక పరిస్థితి చేయి దాటిపోతుండడంతో చర్యలు తీసుకున్నారు. పీకేతో పాటు పవన్ వర్మను పార్టీ నుంచి బహిష్కరించారు. జేడీయూ నుంచి సస్పెండైన తర్వాత ఫ్యూచర్ ప్లాన్‌పై పీకే దృష్టి పెట్టారు. బిహార్‌ గురించి ఫుల్ క్లారిటీ ఉన్న పీకే, ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ వేశారు. బాత్ బిహారీకీ పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఐతే, ఆయన యాత్ర ఏ పద్ధతిలో సాగుతుందన్నదే ఆసక్తికరం.

Tags

Read MoreRead Less
Next Story