రాజ్యసభ బరిలో ప్రియాంకా వాద్రా

రాజ్యసభ బరిలో ప్రియాంకా వాద్రా

తల్లి... సోదరుడు... ఇప్పుడు సోదరి... కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత ట్రెండ్ ఇదే. ఇప్పటికే సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గత ఏడాది వరకు పార్టీ అధ్యక్షునిగా కొనసాగారు. వయనాడ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు ప్రియాంక వాద్రా వంతు వచ్చింది. ఆమెను రాజ్యస భకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రియాంకను ఎగువసభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. లోక్‌సభలో రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రియాంకా వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని రఫ్ఫాడిస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు.

రాజ్యసభలో 245 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ-82, కాంగ్రెస్-46 మంది సభ్యులున్నాయి. ఈ ఏడాది 68 సీట్లు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్ సీనియర్లు అంబికా సోని, గులాంనబీ ఆజాద్‌, దిగ్విజ య్‌ సింగ్‌ తదితరుల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అవకాశం లభించే పేర్లపై చర్చ మొదలైంది. పాతకాపులకు ఎంతమంది మళ్లీ ఛాన్స్ ఇస్తారో తెలీదు గానీ ప్రి యాంక పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గత ఏడాది ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఓ చోటి నుంచి ప్రియాంకతో రాజ్యసభకు పోటీ చేయించాలని ప్రతిపాదించారు. ఉభయసభల్లో బీజేపీని సమర్దవంతంగా ఎదుర్కోవాలంటే రెండు వైపులా పదును ఉన్న కత్తి అవసరమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే, ప్రి యాంకను ఎగువసభకు పంపింతే మోదీ సర్కార్‌ దూకుడును అడ్డుకోవచ్చని అంచనా వేస్తోంది.

దాదాపు ఏడాది క్రితం ప్రియాంకా వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు తల్లి, సోదరునికి చేదోడువాదోడుగా నిలిచిన ప్రియాంక, 2019 జనవరి మూడోవారంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నాళ్ల నుంచో అడుగుతున్న కోరిక నెరవేరడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రియాంక రాక తో పార్టీ రూపురేఖలు మారిపోతాయని కలలు కన్నారు. సరికొత్త పోకడలతో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశపడ్డారు. ఐతే, వారి కలలు ఫలించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘో రంగా ఓడిపోయింది. స్వయంగా ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ, నెహ్రూ-గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న అమేథీలో ఓడిపోయారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తలను నివ్వెరపరిచింది. ప్రియాంక రాకతో కూడా పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని కొంతమంది పెదవి విరిచారు. ఇప్పుడు ప్రియాంకకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే పార్టీపై గాంధీ-నెహ్రూ ముద్ర శాశ్వతంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బానిసలా మారిపోయిందనే ప్రచారానికి తామే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని వాదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story