దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల వ్యవహారం

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల వ్యవహారం
X

రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టారు. రిజర్వేషన్లు ఎత్తేసి బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

SC,ST రిజర్వేషన్.. హక్కు కాదని సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో.. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. రిజర్వేషన్ల పేరుతో గిరిజనలు, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. దళిత సీఎం అన్న కేసీఆర్‌.. తన కేబినెట్ లో ఒక్క దళితుడికి కూడా చోటివ్వలేదని దుయ్యబట్టారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కే కుట్ర చేస్తోందని, రిజర్వేషన్లపై కేంద్రం సుప్రీంకోర్టులో బలహీనవాదనలు వినిపించిందని విమర్శించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ గిరిజన వ్యతిరేకి అని ముద్ర వేయాలన్నారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని విమర్శించారు.

ఎన్నికలు ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని కాంగ్రస్‌ నేతలు స్పష్టం చేశారు. ఓట్లు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాడటం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని విస్మరించి ముందుకెళుతున్నాయని.. ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

Next Story

RELATED STORIES