తాజా వార్తలు

హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ నోటీసులు

హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ నోటీసులు
X

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న టైమ్‌లో.. హైదరాబాద్‌లో కొందరికి ఆధార్‌ సంస్థ నుంచి నోటీసులు రావడం కలకలం రేపింది. 127 మందికి UIDAI నుంచి ఇటీవలే నోటీసులు అందాయి. దాని ప్రకారం వారంతా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు వెళ్లాలి. అక్కడ వీరు పౌరసత్వం నిరూపించుకోకపోయినా, విచారణకు వెళ్లకపోయినా ఆధార్ కార్డు రద్దు అవుతుంది. ఈ నోటీసులు ఇప్పుడు సంచలనంగా మారాయి.

నోటీసులు అందుకున్న 127 మందిలో ఆటో నడుపుతూ జీవించే సత్తార్ ఖాన్‌ అనే వ్యక్తి ఉన్నాడు. అసలీ గందరగోళం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని అతను చెప్తున్నాడు. తరతరాలుగా తన కుటుంబం ఇక్కడే నివసిస్తోందంటున్నాడు. ఆధార్ రెగ్యులేషన్స్ యాక్ట్‌ రూల్ 30 కింద నోటీసులు అందుకున్న వారంతా హైదరాబాద్ UIDAI ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న వ్యక్తి భారతీయ పౌరులు కాదని తేలినా, పౌరసత్వం నిరూపించుకునే సంబంధిత ఒరిజనల్‌ పత్రాలు చూపించకపోయినా ఆధార్ రద్దు అవుతుంది. ఒకవేళ వలస వచ్చిన వాళ్లయితే చట్టబద్ధంగానే దేశంలోకి వచ్చినట్టు పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఆధార్ రద్దు చేస్తారు.

ఆధార్‌ వెరిఫికేషన్‌లో భాగంగా ఇలా నోటీసులు ఇవ్వడం సాధరణమైన విషయమేనని అధికారులు చెప్తున్నారు. ఇదేమీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదని నిరంతరం చేపట్టే వడపోతల్లో భాగమేనని అంటున్నారు. UIDAIకు పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు రావడంతో వాటికీ సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. తప్పుడు పత్రాలతో కొందరు ఆధార్‌ కార్డులు పొందారంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మందికీ నోటీసులు ఇచ్చామంటున్నారు. ఆధార్‌ చట్టం ప్రకారం అక్రమ వలసదారులకు దీన్ని పొందే హక్కు లేదన్నారు.

Next Story

RELATED STORIES