ఏపీలో నిరసనల హోరు.. 63వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు

ఏపీలో నిరసనల హోరు.. 63వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు

అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాజధాని గ్రామాలన్నీ నిరసనలతో అట్టుడుకుతున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, యెర్రబాలెంలో ధర్నాలు, దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు రైతులు. అమరావతే రాజధాని అని ప్రకటించే వరకు ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.

అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. విడతల వారిగా.. దీక్షలో కూర్చొని ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నారు. అటు విశాఖకు రాజధాని అవసరం లేదంటున్నారు వైజాగ్‌ మహిళలు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి ఉద్యమానికి విద్యార్థి లోకం మద్దతు పలికింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి..వచ్చిన విద్యార్థి ప్రతినిధుల బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. TNSF ఆధ్వర్యంలో బస్సు ర్యాలీ నిర్వహించారు. మందడం వచ్చిన విద్యార్థులు.. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు.జగన్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు విద్యార్థులు. విశ్వవిద్యాలయాలను కూడా వైసీపీ కార్యాలయాలుగా మారుస్తున్నారని ఆరోపించారు.

అమరావతి రైతులకు అఖిలభారత కిసాన్‌ సభ మద్దతిచ్చింది. రైతులకు ఉద్యమానికి తాము ఎప్పుడు అండగా ఉంటాన్నారు అఖిల భారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి విజు కృష్ణన్‌. రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారాయన. తుగ్లక్‌ ఒక రాజధాని మారిస్తే.. అభినవ తుగ్లక్‌ అయిన జగన్‌ మూడు రాజధానులు పెడుతున్నారన్నారు విమర్శించారు మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు.

రాజధాని రైతులకు వివిధ జిల్లాల ప్రజలు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ప్రకాశంవాసులు దీక్షా శిబిరాలకు వచ్చి... విరాళాలు అందించారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనుంది అమరావతి జేఏసీ . ఈనెల 24న వేలాది మంది రైతులతో ర్యాలీ చేస్తామని ప్రకటించారు . మార్చి 15, 16, 17 తేదీల్లో ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story