మండలి కార్యదర్శిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఛైర్మన్ షరీఫ్

మండలి కార్యదర్శిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఛైర్మన్ షరీఫ్

మూడు రాజధానుల బిల్లుపై సెలెక్ట్ కమిటీ వ్యవహారం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను.. మండలి చైర్మన్ షరీఫ్ కలిశారు. సభాపతిగా తాను ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ.. శాసనమండలి ఇంఛార్జ్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై ఫిర్యాదు చేశారు. ఆయన్ను తక్షణం సస్పెండ్‌ చేయాలంటూ లేఖలో కోరారు. సర్వీస్ రూల్స్ ప్రకారం అతని తర్వాత సీనియర్ అధికారి అయిన విజయరాజును.. ఆ స్థానంలో నియమించాలని గవర్నర్‌ను షరీఫ్‌ కోరారు. తన ఆదేశాలను అమలు చేసే బాధ్యతను విజయరాజుకు అప్పగించాలని విన్నవించుకున్నారు.

మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లులను అసెంబ్లీ ఆమోదించగా.. పెద్దలసభలో పాస్‌ అవలేదు. సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. సభాపతిగా తన విచక్షణాధికారాలను ఉపయోగించి.. నిర్ణయం తీసుకున్నట్టు షరీఫ్ స్పష్టంగా చెప్పారు. ఐతే.. సెలెక్ట్ కమిటీని నియమించడంలో మండలి కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న బాలకృష్ణమాచార్యాలు, ఆయన సబార్డినేట్ రాజ్‌కుమార్‌.. సహాయ నిరాకరణ చేస్తూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఛైర్మన్ షరీఫ్.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

మండలికి బిల్లులు వచ్చినప్పటి నుంచి.. నేటి వరకు జరిగిన అన్ని పరిణామాలను పూసగుచ్చినట్టు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు ఛైర్మన్ షరీఫ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ మాటే నెగ్గుతుందన్న విషయాన్నీ గుర్తు చేశారు. జనవరి 21, 22 తేదీల్లో సభలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. తొలిరోజు... ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ... రూల్‌-71 ప్రకారం నోటీస్‌ ఇచ్చిందని.. దానిపై చర్చకు అనుమతించానని షరీఫ్ చెప్పారు. ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో.. మూడు రాజధానుల బిల్లు, CRDA రద్దు బిల్లునూ స్వీకరించానని తెలిపారు. సభలో తీవ్ర గందరగోళానికి దారి తీసిన పరిస్థితుల్లో తనకు సహాయకారిగా ఉండాల్సిన ఇంఛార్జ్ కార్యదర్శి, ఆయన సబార్డినేట్‌.. అందుబాటులో లేకుండా పోయారని, తలబిరుసుగా వ్యవహరించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు ఛైర్మన్ షరీఫ్.

జనవరి 22న తన విచక్షణాధికారాలు ఉపయోగించి ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపానని ఛైర్మన్ షరీఫ్ గవ్నరర్‌కు వివరించారు. వారంలో సెలెక్ట్ కమిటీని నియమించండని 27న కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశానని గుర్తుచేశారు. అయితే.. రెండు రోజుల తర్వాత.. ఉప ముఖ్యమంత్రి, మండలిలో నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్.. తన ఆదేశాలకు విరుద్ధమైన సూచనలతో లేఖ రాశారని.. అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, రూల్స్ ప్రకారం సభాపతి నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించజాలరు..ఎవరైనా కాదంటే.. అది సభను ధిక్కరించడమే అవుతుంది.. తన నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిన అవసరం కూడా సభాపతికి ఉండదని ఛైర్మన్ గవర్నర్‌కు గుర్తుచేశారు.

శాసన వ్యవస్థ ఆదేశాలను కాదని.. మండలి ఇంఛార్జ్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు.. ప్రభుత్వంతో చేతులు కలిపి వ్యవహరించారని ఛైర్మన్ లేఖలో తెలిపారు. సెలెక్ట్ కమిటీని నియమించాలన్న తన ఆదేశాలను పాటించకుండా.. పిల్లి సుభాష్‌ రాసిన అసంబద్ధమైన లేఖకే ప్రాధాన్యం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 10 రోజుల తర్వాత.. ఫిబ్రవరి 5న... తన ఆదేశాలకు విరుద్ధమైన ఫైల్‌ను పంపారని.. అది కూడా తన దృష్టికి తీసుకొచ్చేందుకు తప్పితే.. ఆదేశాల కోసం కాదని వివరించారు. ఇది చాలా దారుణమైన విషయంగా చెప్పారు. ఇంఛార్జ్ కార్యదర్శి నిర్లక్ష్యానికి ఇదో నిలువుటద్దం అంటూ ఘాటు పదజాలం వాడారు ఛైర్మన్ షరీఫ్. ఆ మరుసటి రోజు కూడా తాను సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించానని.. అయినా లక్ష్య పెట్టలేదని అన్నారు. 10వ తేదీన మళ్లీ అసంబద్ధమైన, మండలి నిర్ణయాలకు విరుద్ధమైన కారణాలతో.. ఫైల్‌ను తిప్పిపంపారని చెప్పారు. ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయకుండా.. 48 గంటల్లో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ 12వ తేదీన నిక్కచ్చిగా ఆదేశించానని తెలిపారు. అయినా.. ఇప్పటికీ తన ఆదేశాలు అమలు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇది సభా ధిక్కారం కిందకు వస్తుందన్నారు. సహాయ నిరాకరణ చేస్తున్న.. ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story