ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. ఇలా చేస్తే..

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. ఇలా చేస్తే..

కంచె చేను మేస్తోంది. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్‌తో పాటు గుంటూరులోనూ ఇదే తరహా మోసాలు వెలుగు చూడటం కలకలంరేపుతోంది. కొన్నేళ్ల కిందట మాదాపూర్‌ జోన్‌ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్‌కు ఓ వివాహిత ఫిర్యాదు చేసేందుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. మీకేం ఫర్వాలేదు.. సాయం చేస్తానంటూ అక్కడి ఓ ఎస్సై ఆమెకు అభయమిచ్చాడు. కేసు దర్యాప్తు పేరిట ఆమెతో తరచూ మాట్లాడేవాడు. విచారణ పేరుతో అతడు చేసే హడావుడి చూసి ఆమె నమ్మింది. విడతల వారీగా 5 లక్షల వరకు ఇచ్చింది. ఇద్దరి మధ్య పెరిగిన చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఎస్సై ఆ మహిళ తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిపై అనుమానంతో కుమార్తె ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ ఆ ఎస్సై పని చేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. కాలయాపన తరువాత ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆ అధికారి తనకున్న పలుకుబడితో కేసును అటకెక్కించారు. కొన్నేళ్ల కిందట ఆ ఎస్సై శంషాబాద్‌ జోన్‌లోని మరో ఠాణాకు బదిలీ అయ్యాడు. దిశ హత్యోదంతం తరువాత సైబరాబాద్‌ పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో బాధిత మహిళ చొరవ చేసి.. తనకు జరిగిన అన్యాయాన్ని సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ ఎస్సైపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన చర్యల దిశగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అప్పటి నుంచి నిందితుడు విధులకు హాజరు కావట్లేదని తెలిసింది.

గుంటూరులోనూ ఇదే తరహా చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భర్తతో విబేధాల కారణంగా దూరంగా ఉంటున్న ఓ వివాహితను నమ్మించి ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్నాడో సీఐ. మోసపోయానని గ్రహించిన బాధితురాలు నగరపాలెం సీఐ వెంకట్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.. ప్రాథమిక విచారణ తర్వాత సీఐని విధుల నుంచి తప్పించారు. పోలీస్‌శాఖలో పనిచేసే సిబ్బంది, అధికారులు క్రమశిక్షణకు లోబడి విధులు నిర్వర్తించాలని.. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story