విశాఖలో విలువైన భూముల్ని కాజేసేందుకే అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు : స్వామీజీ సంచలనం

అమరావతిని కాదని జగన్ ప్రభుత్వం 3 రాజధానులు ఎందుకు ఏర్పాటు చేస్తోంది? దీని వెనుక రహస్య ఎజెండా ఏమైనా ఉందా? అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఊదరగొడుతున్నదంతా అబద్ధమేనా? అవుననే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖలోని అత్యంత విలువైన భూముల్ని హాం ఫట్ చేసేందుకే అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. వెంకోజీపాలెంలో ఉన్న శ్రీరామానంద ఆశ్రమాన్ని ఆక్రమించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు, హిందూ మత విశ్వాసాలు, హిందూ దేవాలయాలపై కుట్రలు జరుగుతున్నాయని స్వామీజీ ఆరోపించారు. ఇలాంటి కుట్రలు, కూల్చివేతలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ తాను హిందువుగా మారానని ప్రజలను నమ్మించి గెలిచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అటు విశాఖలో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని టీడీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా, మామిడి, జీడి తోటలకు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ సానుభూతి పరులకు ఒకరకంగా.. ఇతరులకు ఇంకో రకంగా పరిహారం చేల్లిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో భూ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
మొత్తంగా ప్రభుత్వ రహస్య ఎజెండా భూముల స్కామేనని అంతా ఆరోపిస్తున్నారు.. కింది స్థాయిలో జరుగుతున్న అక్రమాలు బయటకు రావడం లేదని.. రాజధాని ముసుగులో కబ్జాల పర్వం సాగుతోందని స్వామీజీలు, టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com