ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని రక్షించుకుంటాం : రైతులు

ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని రక్షించుకుంటాం : రైతులు

జై అమరావతి.. సేవ్‌ అమరావతి.. నినాదాలు మార్మోగుతున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని రక్షించుకుంటామని ప్రతిన పూనిన రైతులు వెనక్కు తగ్గడం లేదు. కొందరి రైతులు ప్రాణాలు పోతున్నా.. ఉద్యమం ఆపడం లేదు. 29 రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అమరావతిని తరలించబోమని స్పష్టంగా ప్రకటించేవరకు.. ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, యర్రబాలెంలో ధర్నాలు, దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. రైతుల పోరాటానికి మద్దతు భారీగా పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి.. వీరి దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీక్షలు 65వ రోజుకు చేరినా కూడా ఉద్యమ సెగలు ఆగడం లేదు. ధర్నాలు, దీక్షలు, హోమాలు, ర్యాలీలతో గ్రామాలు అట్టుడుకుతున్నాయి.. నేలపాడులో మహిళలు మాన్యుపాశుపతి హోమం నిర్వహించారు. జగన్ మనసు మార్చాలంటూ చేపట్టిన ఈ యాగంలో... రాజధాని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజధాని భూముల్ని పేదలకు పంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు భగ్గుమంటున్నారు. పేదలు, రైతులకు మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సర్కారు ఇచ్చే ఫ్లాట్లను ఎవరూ తీసుకోవద్దని కోరారు.

రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. వాళ్లు ఓట్లు వేస్తే గెలవలేదంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ చేసిన వ్యాఖ్యలపై.. మహిళలు మండిపడ్డారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరంలో.. ముఖాలకు మేకప్‌ వేసుకుంటూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవికి మేకప్‌పై ఉన్న శ్రద్ధ మాపై లేదా అని ప్రశ్నించారు.

కృష్ణాయపాలెంలో రైతులు సచివాలయానికి వెళ్లే దారిలో వాహనాలను ఆపి అమరావతి గొప్పదనాన్ని వివరించారు.. అమరావతి ప్రాశస్థ్యాన్ని వివరించే కరపత్రాలు పంచారు.

గుంటూరులో జేఏసీ నేతలు చేపడుతున్న దీక్షలు కొనసాగాయి . రేపల్లె టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. రాజధాని కోసం 29 గ్రామాల్లో రైతులు దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం ఆగదని జేఏసీ నేతలు హెచ్చరించారు.

గుంటూరులో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినదించారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story