రాజధానిలో కొత్త రగడ

రాజధానిలో కొత్త రగడ

అమరావతిని కాపాడుకోవడం కోసం 29 గ్రామాల ప్రజలు 64 రోజులుగా ఉద్యమిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. రైతుల ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. వారికి మరింత ఆగ్రహం తెప్పించేలా వ్యవహరిస్తోంది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో సర్వే కోసం ప్రయత్నించడం టెన్షన్‌ రేపింది. మధ్యాహ్నం.. 12 గంటల ప్రాంతంలో రాజధాని గ్రామాల్లోకి వచ్చారు రెవిన్యూ అధికారులు. వారి చేతుల్లో భూ రికార్డులు ఉండటంతో అనుమానించిన రైతులు అడ్డుకున్నారు. ఎందుకోసం వచ్చారో చెప్పాలంటూ నిలదీశారు.

రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో ఎలా సర్వే చేస్తారంటూ మండిపడ్డారు రైతులు. వెంకటపాలెంలో భూముల సర్వే కోసం వచ్చిన దుగ్గిరాల ఎమ్మార్వో మల్లేశ్వరిని అడ్డుకున్నారు. ఆమె కారుని ముందుకుపోనివ్వకుండా రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు రాజధానిలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని యోచిస్తోంది ప్రభుత్వం. అయితే మూడు పంటలు పండే తమ భూములను ఇచ్చింది రాజధాని కోసమని, ఇళ్ల పట్టాలుగా పంచేందుకు కాదంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేదని..అయితే తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అమరావతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు.. పేదలు, రైతులకు మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అటు ఈ ఆందోళనతో అక్కడుకు వచ్చిన పలువురు పేదమహిళలు కూడా రైతులకు మద్దతు తెలిపారు. రైతుల పొట్టగొట్టి ఇచ్చే భూములు మాకెందుకంటూ నిలదీశారు. ఎందుకు వచ్చారో చెప్పాలంటూ రైతులు ఎంతగా డిమాండ్ చేసిన దాదాపు 3 గంటల పాటు నోరు విప్పలేదు ఎమ్మార్వో మల్లేశ్వరి. అయినప్పటికీ.. రైతులు శాంతియుతంగానే నిరసన తెలిపారు. ఆమెకు చేతులెత్తి దండం పెట్టారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. అలిసిపోయారంటూ ఆమెకు అన్నం పెట్టే ప్రయత్నం చేశారు.

రైతులు ఏ మాత్రం వెనక్కితగ్గకపోవడంతో.. ఎట్టకేలకు ఎమ్మార్వో పెదవి విప్పారు. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. ఇంతవరకు ఎక్కడా సర్వే చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మార్వో వివరణను ఏమాత్రం పట్టించుకోని రైతులు సీఆర్డీయే పరిధిలో ఏ విధంగా భూములు గుర్తిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీయే కమిషనర్‌ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది రైతులు సీఆర్డీయే కమిషనర్‌కు ఫోన్‌ చేసి నిలదీశారు. గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన కమిషనర్‌ తమకు తెలియకుండా అధికారులు వచ్చారని.. మళ్లీ వచ్చేప్పుడు సమాచారం ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఎమ్మార్వో కారుకు అడ్డు తప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story