అమరావతిపై ఎందుకంత కక్ష? : చంద్రబాబు

వైసీపీ పాలనలోని.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజా క్షేత్రంలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓ వైపు పార్టీని పటిష్ట పరచడంతో పాటు.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి తన యాత్రను ప్రారంభించారు. మొదట బొప్పూడిలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను కొనసాగించారు. పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర కొనసాగింది. ఒంగోలులో ర్యాలీ నిర్వహించి అద్దంకి బస్టాండ్ వద్ద బహిరంగసభలో పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది.. ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ ఓటు వేశారని.. ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని. శనగలకు మద్దతు ధర ఇస్తామని చెప్పారని.. కొనే నాథుడు కరవైనా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు పట్టడం లేదనా అని ప్రశ్నించారు. పేదవాడికి కడుపు నిండా తిండి కోసం అన్న క్యాంటీన్లు పెడితే వాటిని తీసేశారన్నారు.
చీటికి మాటికి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. తానూ అలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని నిలదీశారు..
రేషన్, పింఛన్, అన్నింటిలో కోతలు వేసుకుంటూ వెళ్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి.. ఉపకారవేతనాలూ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రిలయన్స్, అదానీ, లూలూ సంస్థలు ఎందుకు పోయాయన్నారు? కియాను బెదిరిస్తే వాళ్లు కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
అమరావతి, పోలవరాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎవరైనా మూడు రాజధానులు కావాలని అడిగారా? అమరావతిపై ఎందుకంత కక్ష? అని నిలదీశారు. అమ్మ ఒడి పథకం ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఒకరికే అంటు మాటమార్చారని ఆరోపించారు. జే ట్యాక్స్ కడితేనే మద్యం వస్తుంది.. లేకపోతే రాదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని. నీతి, నిజాయతీతో ఉన్నా.. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశాను అన్నారు. తన భద్రతను కుదించే యత్నం చేస్తున్నారన్నారు. తన భద్రత తొలగించినా ఇబ్బంది లేదు.. తనను ప్రజలే కాపాడుకుంటారన్నారు.
మంగళగిరిలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో నారా లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధానలపై మండిపడ్డారు. నవ మాసాలు...నవ మోసాలు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు చేపట్టారు టీడీపీ నేతలు...మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేసేలా ప్రణాళికలు రూపొందించారు.. దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com