సకుటుంబ సమేతంగా భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్

సకుటుంబ సమేతంగా భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్

భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే రావడం లేదు. కుటుంబ సమేతంగా ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెద్ కుష్నర్‌ కూడా భారతదేశ పర్యటనకు రానున్నారు. ట్రంప్ దంపతులతో పాటు ఇవాంకా దంపతులరాకను అమెరికా అధికారవర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఇవాంక, జారెద్‌లు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరూ అధ్యక్షునికి సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇవాంకా దంపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్ , ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ ముచిన్, కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్ తదితరులు కూడా ఇండియాకు వస్తున్నారు.

ట్రంప్ ఇండియా టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఫిబ్రవరి 24న ట్రంప్ దంపతులు, ఇవాంకా దంపతులు, ప్రతినిధుల బృందం అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. అదే రోజున ప్రధాని మోదీతో కలిసి భారీ రోడ్‌ షోలో పాల్గొంటారు. సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. మొతెరాలో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అదే స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో నిర్వహించే భారీ బహిరంగసభకు హాజరవుతారు. 24న సాయంత్రం అమెరికా అధ్యక్షుడి కుటుంబం ఆగ్రాకు చేరుకుంటుంది. అక్కడ తాజ్‌మహల్‌ను సందర్శిస్తా రు. తాజ్ విజిట్ తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఫిబ్రవరి 25న అధికారిక చర్చల్లో పాల్గొంటారు. భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్‌కు చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.

ఇక, భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ఊరిస్తున్నారు. అమెరికా-భారత్ మధ్య బ్రహ్మాండమైన డీల్ కుదిరే అవకాశముందని చెప్పారు. ఇండియా టూర్‌లో అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకనే ఛా న్స్ ఉందన్నారు. ఐతే, డీల్ విషయంలో మళ్లీ మెలిక పెట్టారు. ఒప్పందం విషయంలో అమెరికా ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డీల్ సరిగా ఉందని అనుకుంటేనే ముందుకు వెళ్తామన్నారు.

ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్‌పై ట్రంప్‌ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఒప్పందం కుదిరే అవకాశం లేదని రెండు రోజుల క్రితమే చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల లోపు కూడా ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం లేదన్నారు. భారీ ఒప్పందాన్ని దాచి పెట్టుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో డీల్ కుదిరే అవకాశముందంటూ రూట్ మార్చారు. ఐతే, ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా లేకపో తే డీల్ కుదరబోదని సంకేతాలిచ్చారు. ఇప్పుడు డీల్‌ ఆగిపోతే మళ్లీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌ తర్వాతే ఒప్పందం జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. భారత్‌-అమెరికా వాణిజ్య లోటుపై ట్రంప్ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అమెరికాతో వ్యాపారం విషయంలో భారత ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోదీ తన తొలి ఐదేళ్ల పాలనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడింది. సుంకాల తగ్గింపు, అమెరికా వస్తువులకు భారతీయ మార్కెట్‌ను సరళతరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం సాగలేదని ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story