మొతెరా స్టేడియం కొత్తదేం కాదు.. పాతదే.. కానీ..

మొతెరా స్టేడియం కొత్తదేం కాదు.. పాతదే.. కానీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..! అత్యంత విశాలమైన గ్రౌండ్.. మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నే కెపాసిటీ.. మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ ఫెసిలిటీస్.. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ భారీ స్టేడియం మన దేశంలోనే ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిసరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మించారు. మొతెరాలో నిర్మితమైన ఆ స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ గ్రౌండ్స్.

మొతెరా క్రికెట్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా 3 ప్రాక్టీస్ గ్రౌండ్స్ ఉన్నాయి. అన్ని వసతులతో 4 డ్రెస్సింగ్ రూమ్‌లు నిర్మించారు. క్రికెట్ టీమ్‌ ల సమావేశాల కోసం ప్రపంచస్థాయి మీటింగ్‌ హాల్‌ ఉంది. వీఐపీల కోసమే ప్రత్యేకంగా కిచెన్, డైనింగ్ హాల్ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా స్టేడియంలోకి వెళ్లడానికి కూడా మార్గాలున్నాయి. 50 విశాలమైన గదుల క్లబ్ హౌజ్, 76 కార్పొరేట్ బాక్సులు, భారీ స్విమ్మింగ్ పూల్‌లను కూడా ఏర్పాటు చేశారు.

మొతెరా స్టేడియానికి చాలా విశేషాలున్నాయి. ఇక్కడ 3 వేలకు పైగా కార్లు పార్క్ చేసుకోవచ్చు. 10 వేల టూవీలర్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేశారు. వర్థమాన క్రికెటర్లకు శిక్షణ, ప్రాక్టీస్ కోసం ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీని కూడా ఇందులోనే నిర్మించారు. ఇక కరెంట్ సరఫరా కోసం సోలార్ ఎనర్జీపై ఆధారపడ్డారు. నిరంతర విద్యుత్తు కోసం సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేశారు. లూబీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో స్టేడియంలో సోలార్ సిస్టమ్‌ను లింక్ చేశారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ లూబీ సోలార్ కంపెనీయే చూసుకుంటుంది.

మొతెరా క్రికెట్ స్టేడియం కెపాసిటీ లక్షా 10 వేలు. ఇది ప్రపంచంలోని అన్ని క్రికెట్ గ్రౌండ్ల కంటే ఎక్కువ. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియానికి ఉండేది. ఎంసీజీ కెపాసిటీ 90 వేలు. అంటే ఎంసీజీ కంటే మొతెరాలో 20 వేల మంది ఎక్కువగా కూర్చోవచ్చు. దీంతో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులు, స్క్వాష్ ఎరీనా, టెన్నిస్ ఎరీనా, 3D ప్రొజెక్టర్ థియేటర్ అదనం.

వాస్తవానికి మొతెరా కొత్త గ్రౌండేమి కాదు.. పాతదే. 2016లో గుజరాత్ ప్రభుత్వం మొతెరా కెపాసిటి పెంచాలని నిర్ణయించింది. అదే ఏడాదిలోనే పాత స్టేడియాన్ని కూల్చేశారు. అధునాతనంగా, అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో కొత్త గ్రౌండ్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 2018లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సీటింగ్ కెపాసిటీని పెంచుతూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నిర్మాణం చేపట్టింది. ఎల్ అండ్ టి సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ప్రముఖ అర్చిటెక్చర్ సంస్థ పాపులస్‌.. మొతెరా కొత్త స్టేడియాన్ని డిజైన్ చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పాపులస్ సంస్థే డిజైన్ చేసింది.

మొతెరా స్టేడియాన్ని 63 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించారు. పాత మొతెరా స్టేడియానికి ఉన్న స్థలంతో పాటు అదనంగా మరికొంత స్థలం సేకరించి నిర్మాణం పూర్తి చేశారు. రెండేళ్లలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికి క్రికెట్ స్టేడియాన్ని ఆవిష్కరించారు. పాత మొతెరా స్టేడియంలో 54 వేల సీటింగ్ కెపాసిటీ ఉండేది. ఇప్పుడు ఏకంగా సీటింగ్ కెపాసిటీ లక్ష 10 వేలకు పెరిగిపోయింది. మొతెరా స్టేడియం నిర్మాణానికి 700 కోట్లు ఖర్చు చేశారు.

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా మొతెరా స్టేడియం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24న ట్రంప్, మోదీలు మొతెరా స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు మొతెరా స్టేడియం మరో స్పెషల్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌ మొతెరా న్యూ గ్రౌండ్స్‌లో జరుగుతుందని సమాచారం. ఐతే, కొత్తగా నిర్మించిన ఈ స్టేడియానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనుమతి అవసరం. అందుకోసం మార్చ్ నెలలో ఆసియా లెవెన్, వరల్డ్ లెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story