ఏపీలో సిట్ ఏర్పాటుపై రాజకీయ దుమారం

ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న నిర్ణయాలు, సంస్థల ఏర్పాటుపై విచారణకు.. జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు చేయడంపై రాజకీయ దుమారం రేపుతుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధాని భూముల వ్యవహారంలో మునుపెన్నడూ జరగనంతగా అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగానే సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటున్నారు. వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. టీడీపీపై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో భయపడేదేమీలేదని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని అది ప్రభుత్వ ఎజెంట్‌గా పనిచేస్తుందని విమర్శించారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు టీడీపీ నేత శ్రవణ్ . జగన్ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఏ తప్పు జరగలేదు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్లు మంత్రుల కమిటీ తేల్చలేకపోయిందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com