పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర వివాదంగా మారిన భూసేకరణ ప్రక్రియ

పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర వివాదంగా మారిన భూసేకరణ ప్రక్రియ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర వివాదంగా మారింది. ప్రభుత్వ భూసేకరణకు పేదలు, దళితులే టార్గెట్‌గా మారారు. గతంలో సర్కార్‌ నుండి పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న భూములను.. అందులో ఉన్న ఇళ్లను కూడా అధికారులు వదలడం లేదు. పంటలను దున్నడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యల వల్ల పేదలు, దళిత రైతులు హడలిపోతున్నారు.

అధికారులు భూములు స్వాధీనం చేసుకుంటున్నామని చెపుతున్న రైతుల్లో ఎవరూ పెద్ద రైతులు లేరు. అందరూ అరెకరం.. 60, 70 సెంట్లు ఉన్న వారే. ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న పేదల పొలాలను బలవంతంగా గుంజుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పేద రైతుల పొట్ట కొడుతున్న సర్కార్‌ వైఖరిపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో కోలుకలూరి చిట్టెమ్మ అనే మహిళా రైతుకు 0.60 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని ఆమె 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇటీవల పేదలకు ఇవ్వాలనే కారణంతో పొలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని.. ట్రాక్టర్‌తో దున్నించారు. అయితే రెవెన్యూ అధికారులు తమకు ఏవిధమైన నోటీసులు ఇవ్వకుండా... పంటను పాడు చేసి భూమిని స్వాధీనం చేసుకోవడంపై చిట్టెమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కుటుంబ సభ్యులతో కలసి పొలంలో నిరసన చేపట్టింది. రెవెన్యూ అధికారులు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకిస్తూ ఆమె మనువడు సోమరాజు.. పొలంలోనే శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశాడు.

పెద్ద రైతులు, భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూముల జోలికి వెళ్లకుండా... పేదలు, దళితుల భూములను బలవంతంగా లాక్కోవడంపై బాధితులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పేదల నుండి స్వాధీనం చేసుకుంటున్న భూములకు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story