అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ టూర్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ టూర్

రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం భారత్ వస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వైట్‌హౌస్‌ నుంచి సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్ లో బయల్దేరారు. ఈ విమానం జర్మనీ మీదుగా భారత్‌కు రానుంది. సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకుంటారు ట్రంప్.

భారత్ పర్యటనకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడారు ట్రంప్. ప్రధాని మోదీ తన స్నేహితుడని, భారత ప్రజలను కలుసుకోవడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాని అన్నారు. నమస్తే మోదీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు. భారత పర్యటనకు ముందు ట్రంప్ కూతురు ఇవాంక కూడా ట్వీట్ చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ మోదీని కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

ట్రంప్ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయానికి చేరుకోగానే.. ప్రధాని మోదీ వెళ్లి ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. అక్కడ మోదీ, ట్రంప్‌లు కలసి మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. తర్వాత మొతెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

ట్రంప్ తొలి భారత పర్యటనకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ట్రంప్ భారత్ లో అడుపెట్టింది మొదలు తిరుగు ప్రయాణమయ్యే వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ట్రంప్‌ ప్రయాణించే మార్గాలన్నీ కోట్లు ఖర్చుచేసి మరమ్మతులు చేయించారు. అహ్మదాబాద్‌లో మొతెరా స్టేడియంలో ట్రంప్‌ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం ట్రంప్‌ ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ ను సందర్శించనున్న నేపథ్యం అక్కడి రోడ్లన్నీ క్లీన్‌ చేయించారు. ట్రంప్‌ ప్రయాణించే రహదారి ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరించారు.

Tags

Read MoreRead Less
Next Story