ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా ట్రంప్‌

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా ట్రంప్‌

అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. మోతీబాగ్‌లోని సర్వోదయా కో ఎడ్యుకేషన్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు మెలానియా వెళ్లారు. అక్కడ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు అమెరికా ప్రథమ పౌరురాలికి సాదర స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్ల మధ్య భారత్, అమెరికా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ బొట్టు పెట్టి మరీ మెలానియాను ఆహ్వానించారు.

సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్‌ కరిక్యులమ్ గురించి మెలానియా అడిగి తెలుసుకున్నారు. హ్యాపీనెస్ అవర్‌లో విద్యా ర్థులు ఏం చేస్తారో ఆరా తీశారు. ఈ సందర్భంగా హ్యాపీనెస్ కరిక్యులమ్ వివరాలు, అమలు చేస్తున్న తీరును స్కూల్ టీచర్లు మెలానియాకు వివరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్న సమయంలో మెలానియా ట్రంప్, గవర్న మెంట్‌ స్కూల్‌కు వచ్చారు. సర్వోదయ స్కూల్‌లో పిల్లలతో మెలానియా కలసిపోయారు. అమెరికా ప్రథమ పౌరురాలిని అన్న బేషజాలకు పోకుండా విద్యార్థులతో సరదగా గడిపారు. వారిని దగ్గరికి తీసుకొని ముచ్చటించారు. ఈ సందర్భంగా పిల్లలు తాము చేసిన ప్రాజెక్టులను మెలానియాకు చూపించారు.

హ్యాపీనెస్ కరిక్యులమ్ కాన్సెప్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018లో తీసుకొచ్చిన ఈ విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు హ్యాపీనెస్ క్లాస్‌లు నిర్వహిస్తారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ క్లాస్ ఉంటుంది. ఆ టైమ్‌లో పిల్లలను స్వేచ్చగా వదిలేస్తారు. ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి టీచర్లు ప్రయత్నిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story