తెలంగాణలో అట్టహాసంగా ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమం

తెలంగాణలో అట్టహాసంగా ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమం

ప్రజల భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నారు మంత్రి కేటీఆర్‌. మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ఆయన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెట్టుగడ్డలోని డైట్‌ కళాశాల ప్రాంగణంలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వెజ్‌ అండ్‌ నాన్‌ వెజిటబుల్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు మంత్రి కేటీఆర్‌. నూతన పురపాలక చట్టంలో అనేక అంశాలను పొందుపరిచామని, దీని వల్ల సమాజం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

మున్సిపల్‌ కొత్త చట్టం ప్రకారం తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవన్నారు మంత్రి హరీష్‌ రావు. సంగారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. పట్టణ ప్రగతి వల్ల అన్ని కాలనీల రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎవరి వార్డుకు వారే కథనాయకులు అన్నారు హరీష్‌. గతంలో ఏ అధికారికైనా లంచం ఇచ్చి ఉంటే.. వారి నుంచి వసూలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నిజమైన పేదలకు తామే ఓనర్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు.

ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. స్థానిక మాణిక్య నగర్‌లో చెట్లు నాటారు. జిల్లా కలెక్టర్‌, మేయర్‌, కమిషనర్‌లతో కలిసి చెరువు బజార్‌ నుంచి బస్ట్‌ స్టాండ్‌ వరకు సైకిల్‌పై తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగర ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణ పరిశుభ్రత కోసం అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని ప్రజాప్రతినిధులు తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story