అన్న క్యాంటిన్ల మూసివేతపై ఆందోళనను ఉద్దృతం చేసిన టీడీపీ

అన్న క్యాంటిన్ల మూసివేతపై ఆందోళనను ఉద్దృతం చేసిన టీడీపీ

అన్న క్యాంటిన్ల మూసివేతపై ఆందోళనను ఉద్దృతం చేసింది టీడీపీ. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు....అన్న క్యాంటీన్ల రద్దుపై తీవ్రంగా మండిపడ్డారు. పేదవాళ్ల కడుపు నింపే క్యాంటీన్‌లు రద్దు చేసి.....పేదల కడపుకొట్టారంటూ విమర్శించారు . నిరుద్యోగులు, నిరుపేదలు, వృద్ధులకు.. అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడేవన్నారు చంద్రబాబు..

రాష్ట్రవ్యాప్తంగా ఆందళనలకు పిలుపునివ్వడంతో... టీడీపీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. అన్నా క్యాంటీన్లు.. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడేవని అన్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ వరుపుల రాజా. ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని నిరసిస్తూ.. వంటవార్పు చేపట్టారు.

పేదలకు అన్నం పెట్టే అన్నాక్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్‌ చేస్తూ.. విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రి ఆవరణలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కకు పెట్టి టీడీపీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, టీడీపీ నేత శ్రీభరత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్లను సచివాలయాలుగా మార్చడం ఏమిటని ప్రశ్నించారు టీడీపీ నేతలు. క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా... విజయవాడ రాణిగారితోట అన్న క్యాంటీన్‌ వద్ద టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ దోశలు వేసి నిరసన తెలిపారు. గోరుముద్ద పేరుతో పాచిపోయిన అన్నం పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటూ అనంతపురంలో... అన్న క్యాంటీన్ల రద్దును నిరసిస్తూ.. ఆందోళన చేశారు టీడీపీ నేతలు. జగన్‌ సర్కారు కక్షపూరిత చర్యలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే... రాజధాని మార్పు, ఇసుక కొరత వంటి వివాదాస్పద అంశాలపై టీడీపీ విమర్శలతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. ఇప్పుడు అన్న క్యాంటీన్‌ రద్దుపైనా తమ్ముళ్ల ఆందోళనలతో.... సర్కారుపై మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story