ట్రంప్‌తో విందు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం కేసీఆర్

ట్రంప్‌తో విందు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సీఎం కేసీఆర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. పరిచయ కార్యక్రమంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సీఎం కేసీఆర్‌.. తొలుత చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ప్రతిగా చేయి చాచిన ట్రంప్‌తో కరచాలనం చేశారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా పురోభివృద్ధి రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రి అంటూ.. కేసీఆర్‌ను ట్రంప్‌కు పరిచయం చేశారు రాష్ట్రపతి. అనంతరం ట్రంప్‌తో మాట కలిపిన కేసీఆర్.. గతంలో హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంకా ట్రంప్‌ హాజరైన విషయాన్ని గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌. దీనికి ట్రంప్‌ చిరునవ్వు నవ్వుతూ అవును నాకు తెలుసని చెప్పినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌తో విందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అతి కొద్ది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. గతంలో ఇవాంక హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి విందులో పాల్గొనడం అందరిని ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రథమ మహిళకు, అలాగే ఇవాంకా ట్రంప్‌ కోసం కేసీఆర్ ప్రత్యేక మైన బహుమతులు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగినా.. ట్రంప్‌ విందుకు ఆహ్వానించిన సమయంలోనే వెంట ఏమీ తీసుకురావద్దని రాష్ట్రపతి భవన్‌ స్పష్టంగా తెలియజేయటంతో దాన్ని విరమించుకున్నారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story