తాజా వార్తలు

మీ వార్డుకు మీరే కేసీఆర్, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి : కేటీఆర్

మీ వార్డుకు మీరే కేసీఆర్, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి : కేటీఆర్
X

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం అయ్యారు. నూతన పురపాలక చట్టంపై అవగాహన కల్పించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు. మీ వార్డుకు మీరే కేసీఆర్, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు కేటీఆర్.

దేవరకొండ పట్టణంలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 48 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నెట్‌వర్క్‌, రోడ్లు, పార్క్‌, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10వ వార్డులోని హనుమాన్‌నగర్‌, లక్ష్మీకాలనీ, అయ్యప్పనగర్‌, జంగాల కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

దేవరకొండలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. దేవరకొండలో కోతుల, పందుల బెడదను పరిష్కరిస్తామన్నారు. ఖాళీ ప్రదేశాల్లో ముళ్లపొదలు, చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చుచేయాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బ్రతకాలని.. లేకపోతే కఠినచర్యలు తప్పవన్నారు. మున్సిపాలిటీల్లో ఇకపై లంచాల మాట వినపడొద్దని హెచ్చరించారు.

అనంతరం నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పట్టణ ప్రగతి సమావేశానికి హాజరయ్యారు మంత్రి కేటీఆర్. చెత్తను కాల్వడం చాలా హానికరమని, ఇకపై ఇలాంటివి నడవవని హెచ్చరించారు. ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉండకపోతే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వార్డు పారిశుధ్య ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు.

మరోవైపు మెదక్ జిల్లాలో పట్టణ ప్రగతిలో భాగంగా మెదక్ జిల్లా సదాశివ పేట 16వ వార్డులో మంత్రి హరీష్ రావు పర్యటించారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ చట్టం ప్రజలకు భరోసా కల్పిస్తుందన్నారు. పట్టణ పరిశుభ్రతపై ప్రజలు శ్రద్ధ చూపించాలని కోరారు. కాలనీ వాసులతో మాట్లాడిన హరీష్ రావు స్థానిక సమస్యలను అడిగి తెల్సుకున్నారు. 75 గజాల లోపు ఇల్లు కట్టాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ తో 250 గజాల్లోపు ఇల్లు కట్టుకోవచ్చని అన్నారు.

Next Story

RELATED STORIES