అమరావతి కోసం దీక్ష చేస్తున్న మహిళా జేఏసీ నేతలకు నోటీసులు

అమరావతి కోసం దీక్ష చేస్తున్న మహిళా జేఏసీ నేతలకు నోటీసులు

రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం తీవ్రం చేస్తోంది అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... విజయవాడ ధర్నా చౌక్‌లో మహిళా JAC 24 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

పోలీసులు 24 గంటల దీక్షకు అనుమతించలేదు. పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున సాయంత్రం 6 గంటల వరకే ఆందోళనలు విరమించాలని స్పష్టం చేశారు. లేదంటే కేసులు తప్పవంటూ హెచ్చరించారు. ఈ మేరకు మహిళా జేఏసీ నేతలకు నోటీసులు జారీ చేశారు. నిర్బంధాలు, పోలీసు కేసులతో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందని నేతలు మండిపడ్డారు. చట్టంపై గౌరవంతో సాయంత్రం 6 గంటలకే దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు..

మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. మంత్రులు తెరలు పెట్టుకుని ప్రజల మధ్య తిరుగాల్సిన దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

అమరావతి భూములు రాజధానికి పనికిరావని చెప్పిన మంత్రులు... పేదల ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రైతుల పోరాటానికి అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేయలేరని స్పష్టం చేశారు..

71 రోజులుగా అమరావతిలో ఉద్యమం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ప్రకటనా చేయడంలేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, రైతుల పోరాటం వృథాగా పోదన్నారు.

రైతుల ఉద్యమం, అమరావతి జేఏసీని చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు మహిళా నేతలు..అందుకే నిరంకుశత్వంతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story