ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులు

ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి  రైతులు

అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అధికార పార్టీ నేతలు, పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఆందోళనలను అణచాలని కుట్ర చేసినా.. రైతులు, మహిళలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదిస్తూనే వున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

మందడం, తుళ్లూరులో రైతుల ధర్నాలు.. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు దగ్గర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. దీక్షా శిబిరాల్లో కూర్చుని రాజధాని కోసం నిరంతర పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఎంత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా.. శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మరోవైపు, అమరావతి ఉద్యమానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజధాని రైతులకు బెంగళూరు పారిశ్రామికవేత్తలు మద్దతు తెలిపారు. మందడం శిబిరంలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. భూకబ్జాల కోసమే సీఎం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని.. జగన్ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అటు మందడం డ్రోన్ వ్యవహరంలోనూ రైతులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండా ఇంటిపై డ్రోన్‌ తిప్పడాన్ని ప్రశ్నించినందుకు.. 40 మంది రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వారిని తీవ్ర వేధింపులకు గురి చేశారు. ప్రభుత్వ దుర్మర్గాంపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదని.. ప్రాణం ఉన్నంత వరకు రాజధాని కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.

రాజధాని కోసం తాము భూములిస్తే ఈ ప్రాంతాన్ని ఎడారి అన్నట్టుగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఇదే చోట పేదలకు పట్టాలిస్తామంటూ జీవోలు ఇవ్వడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు- పేదల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అంతా అర్థం చేసుంటున్నారని అన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు.. భవిష్యత్‌ కార్యాచరణపై కూడా చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. మహిళలు కూడా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story