క్రీడాశిక్షణకు సిద్ధమైన కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాసగౌడ

క్రీడాశిక్షణకు సిద్ధమైన కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాసగౌడ

కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాసగౌడ ఎట్టకేలకు క్రీడాశిక్షణకు సిద్ధమయ్యాడు. భారత క్రీడా ప్రాధికార సంస్థ-సాయ్ శిక్షణ శిబిరానికి శ్రీనివాసగౌడ హాజరుకానున్నాడు. ఈ మేరకు సాయ్ దక్షిణ భారత డైరెక్టర్ అజయ్ కుమార్ భల్, కంబళ అకాడమీ కో ఆర్డినేటర్‌ గుణపాల్ కదంబతో చర్చించారు. ఈ నెల చివరి వరకు కంబళ పోటీలు నిర్వహిస్తారు. పోటీలు ముగిసిన తర్వాత బెంగళూరులోని సాయ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శ్రీనివాసగౌడకు శిక్షణ ఇస్తారు.

కంబళ పోటీల్లో అసామాన్య పరుగుతో శ్రీనివాసగౌడ పేరు మార్మోగిపోయింది. వంద మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తి చేశాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. అతనికి మంచి శిక్షణ ఇప్పిస్తే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట పండిస్తాడని ప్రతిపాదించారు. వ్యాపారదిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా శ్రీనివాసగౌడ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ క్రమంలో సాయ్ నిర్వాహకులు శ్రీనివాసగౌడతో పాటు కంబళ నిర్వాహకులతో చర్చించారు. మొదట్లో సాయ్ ప్రతిపాదనకు శ్రీనివాసగౌడ, కంబళ నిర్వాహకులు అంగీకరించలేదు. కంబళ పోటీలు, ట్రాక్‌పై రన్నింగ్‌కు చాలా తేడా ఉంటుందంటూ సాయ్ ప్రతిపాదనకు నో చెప్పారు. చివరికి సాయ్ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story