వైసీపీ దౌర్జన్యకాండ.. శాంతియుతంగా ఉండే విశాఖలో బీభత్సం

వైసీపీ దౌర్జన్యకాండ.. శాంతియుతంగా ఉండే విశాఖలో బీభత్సం

విశాఖ ఎయిర్‌పోర్టు రణరంగాన్ని తలపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో రెచ్చిపోయారు. వైసీపీ దౌర్జన్యకాండతో దాదాపు 4 గంటలపాటు కాన్వాయ్‌లోనే కూర్చున్నారు చంద్రబాబు. కాన్వాయ్‌ను అడుగు కూడా ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఇంతా జరుగుతుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు..గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినదిస్తున్న వైసీపీ శ్రేణుల్ని లోనికి వదిలిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్ని మాత్రం అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలు, వైసీపీ కుట్రల్ని దాటుకుని విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో కొందరికి గాయాలయ్యాయి. చంద్రబాబే టార్గెట్‌గా కోడిగుడ్లు, టమాటాలు విసిరారు వైసీపీ కార్యకర్తలు. అవి పక్కనే ఉన్న కానిస్టేబుల్‌పై పడ్డాయి. చెప్పులు విసిరేందుకూ విఫలయత్నం చేశారు.

వైసీపీ దౌర్జన్యకాండపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఎయిర్‌పోర్టు ప్రాంగంణంలోనే నేలపై కూర్చొని నిరసన తెలిపారు. షూట్‌ చేసినా వెనక్కి వెళ్లబోనని తేల్చిచెప్పారు. వైసీపీ గూండాలు అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. CRPC 151 సెక్షన్‌ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. అరెస్టు విషయం తెలుసుకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టు వద్ద ఉన్న టీడీపీ నేతల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు‌‌ను అరెస్ట్ చేసి ఎయిర్‌పోర్టులోకి ఈడ్చుకెళ్లారు. అటు మీడియాపైనా దౌర్జన్యంగా వ్యవహరించారు. లోగోలను కూడా లాగిపడేశారు.

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శాంతియుతంగా ఉండే విశాఖలో బీభత్సం సృష్టించారని నేతలు ఫైరయ్యారు. పర్యటనకు అనుమతిచ్చి..అరెస్ట్ ఎలా చేస్తారంటూ నిలదీశారు. రైతు సమస్యలపై చంద్రబాబు విశాఖ పర్యటనకు వస్తే అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికారం చేతిలో ఉందని విర్రవీగుతున్నారని.. 9 నెలలకే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు.

మరోవైపు చంద్రబాబును అడ్డుకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు సమర్థించుకున్నారు.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ ఆగ్రహాన్ని తెలియజేశారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు. మొత్తంగా వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరుపై టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు కూడా మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story