అల్లర్లు తగ్గినా.. ఢిల్లీ ప్రజలను వెంటాడుతున్న భయం

అల్లర్లు తగ్గినా.. ఢిల్లీ ప్రజలను వెంటాడుతున్న భయం

నాలుగు రోజుల హింస తర్వాత ఢిల్లీ మెల్లిమెల్లిగా తేరుకుంటోంది. అల్లర్ల ఘటనలు దాదాపుగా తగ్గిపోయాయి. అయితే..నాలుగు రోజులు హింసాత్మక ఘటనల తాలుకు భయం మాత్రం మాత్రం ఈశాన్య ఢిల్లీని వెంటాడుతోంది. జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నా..ఎప్పుడు ఏం జరుగుతుందననే భయం వారిలో కనిపిస్తోంది. వీధులన్ని రాళ్లతో నిండిపోయాయి. యమునా వీహార్ తో పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎటూ చూసిన కాలిపోయిన షాపులు, కూలిపోయిన గోడలతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే అల్లర్ల ఘటనలు తగ్గినా..ఢిల్లీ ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ బైజాల్‌ సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫ్రాబాద్, గోకుల్‌పురిల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ పోలీసులతో పాటు 7 వేల మంది పారా మిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి.

అల్లర్లు సద్దుమణగటంతో ఇక పోలీసులు చట్టపరమైన చర్యలను ముమ్మరం చేశారు. వీడియో, సీసీ ఫూటేజ్ ల ఆధారంగా అల్లరి మూకలను, దాడులకు పాల్పడిన వారిని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. దాదాపు 630 మందిని అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి బుల్లెట్ గాయాలు ఉండటంతో ఆ దిశగా కూడా ఎంక్వైరీ ముమ్మరం చేస్తున్నారు.

నాలుగు రోజులు హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 42కి చేరింది. వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇప్పటిరవకు 16 మంది ఐడెంటిఫై చేసినట్లు జీటీబీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయాలతో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం నలుగురు చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మందికి బుల్లెట్ గాయాల వల్లే చనిపోయారని, కొందరికి కత్తిపోట్ల గాయాలతో, ఇంకొందరు కాలిన గాయాలతో చనిపోయారని చెబుతున్నారు. అల్లర్లలో దుండగులు ఆయుధాలతో పాటు యాసిడ్ దాడులకు కూడా పాల్పడ్డారు. అయితే..అల్లర్ల ఘటనలు తగ్గటంతో ఢిల్లీ ప్రభుత్వం ఇక సహాయ చర్యలపై దృష్టి సారించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాంతాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధితులకు ఆహారం అందిస్తున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి తక్షణ సాయం కింద ఇవాళ 25 వేల సాయం అందించనుంది ఢిల్లీ ప్రభుత్వం.

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాంధీ పుట్టిన దేశంలో మత హింస తగదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అన్నారు. సమాజంలో అంతా కలిసిమెలసి జీవించేందుకు గతంలో కన్నా ఇప్పుడే మహాత్ముడి స్ఫూర్తి అవసరం ఎంతో ఉందన్నారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Tags

Read MoreRead Less
Next Story