విశాఖ ఘటనపై వైసీపీ - టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు

విశాఖ ఘటనపై వైసీపీ - టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు

చంద్రబాబు పర్యటన సందర్భంగా విశాఖలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లరాడం లేదు. రాజకీయ రచ్చను ఇంకాస్త పెంచుతున్నాయి. ముఖ్యంగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. చంద్రబాబును విశాఖలో స్థానిక ప్రజలే అడ్డుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపిస్తున్నట్టు పులివెందులకు చెందిన ఒక్కరు కూడా విశాఖ ఎయిర్‌ పోర్టుకు రాలేదని.. అలా ఒక్కరు వచ్చినట్టు నిరూపించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అన్నారు.

చంద్రబాబుపై ఎయిర్‌పోర్టులో దాడికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారనే కోపంతోనే ప్రజలు స్వచ్ఛంధంగా అడ్డుకున్నారన్నారు. విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నది వైసీపీ నేతలే అంటూ ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. చంద్రబాబు అడుగుపెట్టడానికి వీలు లేదని జట్టి రామారావు హల్‌ చల్‌ చేశాడని, అతడు కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ పట్టుకొని పెట్రోల్‌ సీసా పట్టుకున్నట్లు యాక్ట్‌ చేశారని.. అతడికి బొత్స, అవంతికి సంబంధం ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విద్యార్థి నేతలు కొందరు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరికొందరు ఉన్నారంటూ వీడియో సాక్ష్యాలను బయటపెట్టారు.

మంత్రుల వ్యాఖ్యలపై టీడీపీ నేత పట్టాభి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ఛాలెంజ్‌ చేసే స్థాయి అవంతికి లేదన్నారు. ఓ బంతిలా దొర్లుకుంటూ పార్టీలు మారే అవంతిని త్వరలోనే ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ పట్టాభి ఫైర్‌ అయ్యారు.

విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం తప్పే అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌. రాజకీయాల్లో విలువలు ఉండాలన్నారు.. విశాఖలో చంద్రబాబుపై దాడి ఏమాత్రం సమర్ధనీయం కాదన్నారు. వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. విశాఖలో కచ్చితంగా చంద్రబాబు పర్యటించి తీరుతారని టీడీపీ నేతలు ఛాలెంజ్ విసురుతున్నారు.. ఎన్నిసార్లు చంద్రబాబు విశాఖకు వచ్చినా ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా పరిస్థితి హాట్‌హాట్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story