పార్టీ యువనేతలకు లోకేష్ విందు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్‌లోని నివాసంలో పార్టీ యువనేతలకు విందు ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ లంచ్ మీటింగ్ సాగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు యువనేతలు. అయ్యన్న, కింజరపు, గౌతు, JC, పరిటాల, KE, దేవినేని, కరణం, మాగంటి, కొడెల, బొజ్జల కుటుంబాలకు చెందిన యువ నేతలు గెట్ టు గెదర్‌లో పాల్గొన్నారు.
ఈ లంచ్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలలో పరిస్థితుల పై చర్చించారు. ప్రధానంగా.. ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధంగా ఉండాలని యువనేతలకు దిశానిర్ధేశం చేశారు లోకేష్. ఎన్నికల్లో ఓటమి సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. కమిటీలలో యువతకు ప్రాధ్యానం ఇస్తామని , సోషల్ మీడియాలో ప్రజల వాణి వినిపించడంపై దృష్టిపెట్టాలని, జిల్లా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కింది స్థాయి కార్యకర్తలను కలుపుకుని వెళ్లాలని.. కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పారు.
దాదాపు 30 మంది యువనేతలు హాజరైన ఈ విందు సమావేశంలో చంద్రబాబు దంపతులు సైతం కొద్ది సేపు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని యువనేతలకు భరోసా ఇచ్చారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com