కరోన వైరస్‌పై తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమీక్ష

కరోన వైరస్‌పై తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమీక్ష

కరోన వైరస్‌పై కేబినెట్ సబ్‌ కమిటీ సమీక్ష నిర్వహిస్తోంది. కరోనాపై ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. సీఎస్, వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు.. ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింత పెంచాలన్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోల్చితే.. కరోనాలో మరణాల రేటు తక్కువని.. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్న మంత్రులు.. కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైరస్‌కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని.. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో కరోనాపై అవగాహన కల్పించే సమాచారం అందించాలని సూచించారు. పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకున్నా.. వైరస్‌పై అసత్యాలను ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story