తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు అయింది. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఆదివారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలింది. మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన వ్యక్తి ఫిబ్రవరి 17న దుబాయ్‌ వెళ్లి నాలుగురోజుల పాటు హాంకాంగ్‌ వ్యక్తులతో కలిసి పనిచేశారు. అనంతరం తిరిగివచ్చిన అతను.. జ్వరం రావడంతోనే ఫిబ్రవరి 27న బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో మార్చి 1న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి ఈటెల తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తి ప్రయాణించిన బస్సులో 27 మంది ప్రయాణించినట్టు తెలిసింది. ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యుల్లో 80 మందిని గుర్తించామని తెలిపారు. వారందరికి టెస్టులు చేస్తామని మంత్రి ఈటెల చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.

కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు.. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story