తెల్లదోమ పోటుతో కుదేలవుతున్న అన్నదాతలు

తెల్లదోమ పోటుతో కుదేలవుతున్న అన్నదాతలు

మామిడి, కొబ్బరి, పామాయిల్‌ తోటలకు తెల్లదోమ పోటుతో అన్నదాతలు కుదేలైపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజవర్గంలో రైతన్నలకు తెల్లదోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా పంట చేతికొచ్చే సమయంలో పాగమంచు, వడగాల్పులు , అకాల వర్షాల కారణంగా భారీ స్థాయిలో నష్టపోతుంటే.. ఇప్పుడు తెల్లదోమ రూపంలో మరో సమస్య తోడైంది. ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.

ఫిబ్రవరి నెలఖరుకి కాయదశలో ఉండాల్సిన మామిడి ఇప్పటికీ పూత దశలోనే ఉంది. ఇప్పటికే పెద్దమొత్తంలో మామిడి తోటలకు ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతరత్రా పనుల కోసం లక్షల్లో పెట్టుబడులు పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లదోమ పోటుతో ఈ ఏడాడి భారీ నష్టాలు తప్పేలా లేదని కొబ్బరి, పామాయిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటు రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పించి భరోసా ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ అధికారులు పత్తా లేకుండా పోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కొత్తగా వచ్చిన తెగుళ్లపై ఎప్పటికప్పుడు అన్నదాతలకు దిశానిర్దేశం చేసుంటే తెల్లదోమ సమస్య ఇంత తీవ్రత అయ్యేది కాదని రైతు సంఘనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు మొదలు పెట్టే ముందు తగిన సూచనలు ఇచ్చి, బీమా సౌకర్యం కల్పించి ఉంటే పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులకు బీమా రూపంలో సహాయం అందేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయటి దేశాల నుంచి తెచ్చిన మొక్కలు తదితర ఉత్పత్తుల వల్ల దేశంలోకి తెల్లదోమ ప్రవేశించిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని నివారణకు ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఆకాల వర్షాలు, గాలులతో అన్నదాతలను నట్టేట ముంచుతుంటే.. ఇప్పుడు తెల్లదోమ పోటుతో ఉద్యాన పంటలు తీవ్ర నష్టాలు మిల్చుతున్నాయి. ఇప్పటికైనా ఉద్యాన శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story